Bhadrachalam: భద్రాచలంలో రూ.275 కోట్లతో రామాలయ అభివృద్ధి పనుల పరిశీలన!
Bhadrachalam: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. రూ.275 కోట్లతో జరుగుతున్న పనులపై సమీక్ష.
Bhadrachalam: భద్రాచలంలో రూ.275 కోట్లతో రామాలయ అభివృద్ధి పనుల పరిశీలన!
Bhadrachalam: దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ సమగ్ర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఆలయ అభివృద్ధి పనుల్లో సంప్రదాయాలు, ఆగమ శాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‌తో కలిసి భద్రాచలం చేరుకున్న మంత్రి పొంగులేటికి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభం, మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదాశీర్వచన మండపంలో అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య తీర్థప్రసాదాలు అందించి శాలువాలతో సత్కరించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో 275 కోట్లతో జరిగే నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ ఉత్తరం, పడమర, దక్షిణం వైపున జరుగుతున్న వివిధ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి జాప్యం లేకుండా పనులను వేగవంతం చేయాలని అధికారులకు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఇదే సమయంలో ఆలయ అర్చకులు దక్షిణం వైపున నిర్మించనున్న ఉపాలయాలకు సంప్రదాయబద్ధంగా భూస్పర్శ ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు.
అర్చకుల విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఉపాలయాలకు భూస్పర్శ ఉండేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం పట్టణంలోని ముదిరాజ్ బజార్ ప్రాంతంలో లబ్ధిదారుల కోసం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పనులను కూడా మంత్రి పరిశీలించారు. భద్రాచలం రామాలయ సమగ్ర అభివృద్ధి పనులపై సంబంధిత ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.




