Kothagudem: వెదురు పెంపకంతో పర్యావరణ పరిరక్షణ, ఉపాధి: కలెక్టర్ అంకిత్!

Kothagudem: ప్రపంచ వెదురు దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం ఐడీఓసీలో వేడుకలు. వెదురు పెంపకం, ఉత్పత్తులతో ఉపాధి అవకాశాలు పెంచాలని కలెక్టర్ అంకిత్ పిలుపు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 18 Sept 2026 5:17 PM IST
Kothagudem
X

Kothagudem: వెదురు పెంపకంతో పర్యావరణ పరిరక్షణ, ఉపాధి: కలెక్టర్ అంకిత్!

కొత్తగూడెం: వెదురు పెంపకాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచవచ్చని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అన్నారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ అంకిత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వెదురు వేగంగా అభివృద్ధి చెందే సహజ వనరుల్లో ఒకటని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. వెదురు పెంపకంతో పచ్చదనం పెరగడంతో పాటు నేలకోతను నియంత్రించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రకృతి వనరులను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యతగా పేర్కొన్నారు.

వెదురుతో ఇళ్ల నిర్మాణ సామగ్రి, ఫర్నిచర్, కాగితం, హస్తకళలు, అలంకరణ వస్తువులు తదితర అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారని తెలిపారు. వెదురు ఆధారిత ఉత్పత్తులకు మార్కెట్లో ఉన్న అవకాశాలను కళాకారులు, చేతివృత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంప్రదాయ నైపుణ్యాలకు ఆధునిక సాంకేతికత, డిజైన్‌లను జోడిస్తే ఆదాయాన్ని మరింత పెంచుకోవచ్చన్నారు.

వెనుకబడిన తరగతులకు చెందిన కళాకారులు, చేతివృత్తిదారులను వెదురు ఉత్పత్తుల తయారీ వైపు ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్‌పై శిక్షణ, అవగాహన కల్పించడం ద్వారా ఉపాధి అవకాశాలను పెంచవచ్చని తెలిపారు. భవిష్యత్ తరాలకు పచ్చని, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు మొక్కల పెంపకం, సంరక్షణకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిణి విజయలక్ష్మి, మేదరి కుల సంఘ నాయకులు కొంటు శ్రీనివాస్, స్వరూప, సిందూజ, కళావతి, రమాదేవి, పిల్లి శీను, సోమయ్య, బొల్లం శ్రీనివాస్, ప్రవల్లికతో పాటు కళాకారులు, చేతివృత్తిదారులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM