Aswapuram: రసాభాసగా సాగునీటి సమావేశం.. రైతుల ఆగ్రహం

Aswapuram: ఎల్‌నినో సాకుతో తుమ్మల చెరువు ఆయకట్టుకు రబీ సాగునీరు ఇవ్వలేమని అధికారులు చెప్పడంతో అశ్వాపురంలో జరిగిన సమావేశం రసాభాసగా ముగిసింది.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 17 Nov 2026 9:50 PM IST
Aswapuram
X

Aswapuram: రసాభాసగా సాగునీటి సమావేశం.. రైతుల ఆగ్రహం

అశ్వాపురం: సాగునీటి విషయంలో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రబీ పంటలకు తుమ్మల చెరువు ఆయకట్టుకు నీరు అందించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేయడంతో మొండికుంటలో నిర్వహించిన అవగాహన సమావేశం రసాభాసగా ముగిసింది.

ప్రాజెక్టుకు జన్మస్థలమైన ప్రాంతానికే సాగునీటి కష్టాలా? తుమ్మల చెరువును పూర్తిస్థాయిలో నింపి, రబీ వరి పంటకు నీరు అందించాలని రైతులు పట్టుబట్టారు. ఇప్పటికే విత్తన ధాన్యం కొనుగోలు చేసి, నారుమళ్లు సిద్ధం చేసుకున్నామని, చివరి నిమిషంలో నీరు లేదంటే ఎలా అని అధికారులను నిలదీశారు. కనీసం ఒక ప్రధాన కాలువ పరిధిలోని ఆయకట్టుకైనా నీరు అందించాలని రైతులు ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు.

దీంతో సాగునీటి సమస్య ఈఈ కార్యాలయానికి చేరింది. రైతులు ఎస్ఆర్ఎల్పీ ఈఈ తెల్లం వెంకటేశ్వర్లును కలిసి తుమ్మల చెరువును నింపి రబీ పంటలకు సాగునీరు అందించాలని వినతిపత్రం సమర్పించారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందిస్తూ సమస్యను ఉన్నతాధికారులు, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో రైతు సంఘాల ప్రతినిధులు మర్రి మల్లారెడ్డి, తోకల వీరయ్య, బద్దం శంభారెడ్డి, తుక్కాని రామిరెడ్డి, స్వర్గం రాఘవులు, బొక్కా రవీందర్, తెల్లం నాగేశ్వరరావు, వేల్పుల వెంకన్న తదితరులతో పాటు ఏడీఏ తాతారావు, ఏవో చటర్జీ, ఇరిగేషన్ డీఈ రమేష్‌బాబు, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు, ఏఈఓలు, ఇరిగేషన్ ఏఈ, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు.

రైతుల ప్రశ్న ఒక్కటే.. ఇప్పటికే సాగుకు సిద్ధమైన పంటకు నీరందుతుందా? లేదా? అన్నదే ఇప్పుడు అధికారుల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్న ఆయకట్టు రైతుల ఆవేదన.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA