Ashwaraopeta: అశ్వరావుపేట ఉద్యాన శాస్త్రవేత్తల ఆయిల్ పామ్ తోటల సందర్శన

Ashwaraopeta: అశ్వరావుపేట ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్తల దమ్మపేట ఆయిల్ పామ్ తోటల సందర్శన. ఎల్ నినో ప్రభావం, నీటి ఎద్దడిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరణ.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 7 Oct 2026 5:37 PM IST
Ashwaraopeta
X

Ashwaraopeta: అశ్వరావుపేట ఉద్యాన శాస్త్రవేత్తల ఆయిల్ పామ్ తోటల సందర్శన

Ashwaraopeta: ఈరోజు దమ్మపేట గ్రామానికి చెందిన రైతు శ్రీ పెరుమాల కృష్ణమూర్తి సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటను ఉద్యాన పరిశోధన స్థానం, అశ్వరావుపేట శాస్త్రవేత్త డా. మజ్జిగ శ్రీనివాస్ మరియు TG OILFED సిబ్బంది సందర్శించి క్షుణ్ణంగా పరిశీలించారు. తోట పరిశీలనలో కొన్ని ఆయిల్ పామ్ మొక్కల మొవ్వ భాగం ఒక వైపుకు వాలిపోతున్న లక్షణాలను గుర్తించారు.

ఈ సమస్యకు గల కారణాలను తెలుసుకునేందుకు తోటలో అమలు చేస్తున్న నీటి యాజమాన్య పద్ధతులు, డ్రిప్ వ్యవస్థ పనితీరు, మొక్కలకు నీరు అందిస్తున్న విధానం, గతంలో ఎరువులు వేసిన సమయం మరియు మోతాదు, చీడపీడల యాజమాన్య పద్ధతులు తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రైతును అడిగి తోట యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా డా. మజ్జిగ శ్రీనివాస్, ఉద్యాన శాస్త్రవేత్త, ఉద్యాన పరిశోధన స్థానం, అశ్వరావుపేట మాట్లాడుతూ, ఎల్‌నినో (El Niño) ప్రభావిత పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతలు మరియు గాలిలో తక్కువ తేమ వంటి పరిస్థితుల్లో ఆయిల్ పామ్ మొక్కలు తేమ ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగిన నీటి మరియు పోషక యాజమాన్య పద్ధతులను సకాలంలో చేపట్టడం ద్వారా సమస్య తీవ్రతను తగ్గించి, మొక్కలు దెబ్బతినకుండా నివారించవచ్చని వివరించారు.

ఎక్కడైనా ముఖ్యంగా పొడి వాతావరణంలో వేపర్ ప్రెషర్ డెఫిసిట్ అధికంగా ఉన్నప్పుడు మొక్కల నుంచి నీటి నష్టం పెరుగుతుందని తెలిపారు. మొక్క కోల్పోతున్న నీటికి అనుగుణంగా వేర్ల ద్వారా నీరు అందని పరిస్థితుల్లో మొక్కలు తీవ్రమైన నీటి ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. ఇటువంటి పరిస్థితులు మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపడంతో పాటు, కొన్ని మొక్కల్లో మొవ్వ భాగం బలహీనపడి ఒక వైపుకు వాలిపోవడానికి దోహదపడే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమస్యపై భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలతో కూడా సంప్రదించి చర్చించినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఆయిల్ పామ్ తోటల్లో డ్రిప్ ద్వారా నీరు అందిస్తున్నప్పుడు ప్రతి మొక్క చుట్టూ నాలుగు వైపులా వేర్ల పరిధిలో నేల సమానంగా తడుస్తున్నదా లేదా రైతులు తప్పనిసరిగా పరిశీలించాలని సూచించారు. డ్రిప్పర్లు సక్రమంగా పనిచేస్తున్నాయా, అన్ని డ్రిప్పర్ల నుంచి సమాన పరిమాణంలో నీరు విడుదల అవుతున్నదా అనే విషయాలను ఎప్పటికప్పుడు గమనించాలి.

ముఖ్యంగా పెద్ద ఆయిల్ పామ్ మొక్కల వేర్లు విస్తారంగా వ్యాపించి ఉంటాయి కాబట్టి, ఒక వైపు మాత్రమే నీరు అందకుండా, మొక్క చుట్టూ నాలుగు వైపులా సమానంగా తేమ ఉండేలా నీటిని అందించాలని తెలిపారు. ఒక వైపు నేల తడిగా ఉండి, మరో వైపు పొడిగా ఉంటే వేర్లకు నీటి లభ్యతలో అసమానత ఏర్పడి మొక్క ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటుందని తెలిపారు. అందువల్ల ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో ప్రతిరోజూ క్రమం తప్పకుండా మొక్కలకు అవసరమైన మేరకు నీటిని అందిస్తూ, మొక్క చుట్టూ నాలుగు వైపులా నేల సమానంగా తడుస్తున్నదా లేదా పరిశీలించాలని రైతులకు సూచించారు.

ప్రస్తుత పొడి వాతావరణ పరిస్థితుల్లో నీటి యాజమాన్యంతో పాటు పొటాషియం పోషణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. మూడు సంవత్సరాలు నిండిన ఆయిల్ పామ్ తోటల్లో ప్రస్తుత పరిస్థితుల్లో డ్రిప్ ఫర్టిగేషన్ ద్వారా ఎకరానికి నెలకు 5 కిలోల యూరియా, 3 కిలోల DAP మరియు 10 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అందించాలని సూచించారు. పొడి వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో తగిన మోతాదులో నీటిని అందిస్తూ ఈ పోషక యాజమాన్యాన్ని చేపట్టాలని తెలిపారు. వాతావరణ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చిన అనంతరం ఆయిల్ పామ్‌కు సిఫారసు చేసిన సాధారణ ఎరువుల యాజమాన్య పద్ధతులను అనుసరించాలని సూచించారు.

మొక్క మొవ్వ భాగం ఒక వైపుకు వాలుతున్నట్లు ప్రారంభ దశలోనే గుర్తించినట్లయితే వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మొవ్వ ఏ వైపుకు వాలుతున్నదో ఆ వైపున అధిక భారం కలిగిస్తున్న ఆకులను అవసరమైన మేరకు తొలగించి, మొవ్వ భాగంపై పడే భారాన్ని తగ్గించాలని తెలిపారు.

అదే సమయంలో అటువంటి మొక్కలకు నీటి ఎద్దడి ఏమాత్రం రాకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, మొక్క చుట్టూ నాలుగు వైపులా సమానంగా తేమ ఉండేలా నీటిని అందించాలని సూచించారు.

ప్రస్తుత ఎల్‌నినో ప్రభావిత పొడి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులు తమ తోటలను క్రమం తప్పకుండా పరిశీలించాలని సూచించారు. ముఖ్యంగా తోటల్లో నీటి ఎద్దడి రాకుండా చూడటం, డ్రిప్ ద్వారా మొక్క చుట్టూ నాలుగు వైపులా సమానంగా నీరు అందించడం, డ్రిప్పర్ల పనితీరును తరచుగా తనిఖీ చేయడం, సమతుల్య పోషక యాజమాన్యం పాటించడం మరియు మొక్కల్లో కనిపించే అసాధారణ లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యమని తెలిపారు.

మొవ్వ భాగం ఒక వైపుకు వాలడం, ఆకులు వాడిపోవడం లేదా ఇతర అసాధారణ లక్షణాలు కనిపించిన వెంటనే రైతులు సంబంధిత ఉద్యాన శాఖ అధికారులు, TG OILFED సిబ్బంది లేదా ఉద్యాన శాస్త్రవేత్తలను సంప్రదించి సలహాలు తీసుకోవాలని సూచించారు.

ఈ క్షేత్ర సందర్శనలో డా. మజ్జిగ శ్రీనివాస్, ఉద్యాన శాస్త్రవేత్త, సాయి గణేష్, రీసెర్చ్ అసోసియేట్, ఉద్యాన పరిశోధన స్థానం, అశ్వరావుపేట, మరియు TG OILFED సిబ్బంది పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA