Kothagudem: పట్టభద్రుల ఓటరు నమోదుకు మరో అవకాశం: రేగా కాంతారావు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టభద్రుల ఓటరు నమోదుకు కల్పించిన మరో అవకాశాన్ని అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలని రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
Kothagudem: పట్టభద్రుల ఓటరు నమోదుకు మరో అవకాశం: రేగా కాంతారావు!
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు గతంలో నిర్ణయించిన గడువులోగా నమోదు చేసుకోలేకపోయిన అర్హులైన పట్టభద్రులకు మరో అవకాశం కల్పించిన నేపథ్యంలో, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకోవాలని మాజీ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు.
పట్టభద్రుల ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చోటు కల్పించాలనే ఉద్దేశంతో కల్పించిన ఈ అవకాశాన్ని ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని, ఇప్పటివరకు నమోదు చేసుకోని అర్హులైన పట్టభద్రులందరూ వెంటనే తమ దరఖాస్తులను సమర్పించాలని కోరారు.
అదేవిధంగా ఇప్పటికే విడుదలైన పట్టభద్రుల ఓటరు ముసాయిదా జాబితాలో తమ పేర్లు ఉన్నాయో లేదో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశీలించుకోవాలని సూచించారు. పేర్లు నమోదు కాకపోయినా, ఓటరు జాబితాలో ఏవైనా తప్పులు లేదా అభ్యంతరాలు ఉన్నా సంబంధిత అధికారులకు డిసెంబర్ 10వ తేదీలోపు తెలియజేసి సరిచేసుకోవాలని కోరారు.
బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ క్యాడర్ గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రతి గ్రామం, ప్రతి వార్డులో పట్టభద్రులను గుర్తించి అర్హులైన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకునేలా కృషి చేయాలని సూచించారు. అలాగే ఇప్పటికే విడుదలైన ఓటరు జాబితాను పరిశీలించుకునేలా పట్టభద్రులకు అవగాహన కల్పించాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే గడువులోగా తెలియజేసేలా సహకరించాలని పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణులందరూ ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని సమన్వయంతో పనిచేయాలని, జిల్లాలో అర్హులైన ఒక్క పట్టభద్రుడు కూడా ఓటు హక్కుకు దూరం కాకుండా కృషి చేయాలని రేగా కాంతారావు కోరారు.




