Nelakondapalli: నేలకొండపల్లిలో ప్రాచీన మానవ నివాస ఆనవాళ్లు!
Nelakondapalli: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసరాల్లో తెలంగాణ వారసత్వ శాఖ సర్వేలో ప్రాచీన మానవ నివాస ఆనవాళ్లు, ఇటుక నిర్మాణాలు లభ్యం: కలెక్టర్ దివాకర టిఎస్.
Nelakondapalli: నేలకొండపల్లిలో ప్రాచీన మానవ నివాస ఆనవాళ్లు!
Nelakondapalli: నేలకొండపల్లి పరిసర ప్రాంతాల్లో ప్రాచీన మానవ నివాసానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన ఆధారాలు వెలుగులోకి వచ్చాయని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ తెలిపారు. జిల్లా కలెక్టర్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులతో కలిసి బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసరాల్లో పురావస్తు అన్వేషణ జరుగుతున్న ప్రాంతాన్ని శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, నేలకొండపల్లి సమీపంలోని బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసరాల్లో తెలంగాణ వారసత్వ శాఖ పురావస్తు అన్వేషణ బృందం నిర్వహించిన క్షేత్రస్థాయి ఉపరితల సర్వేలో ప్రాచీన నివాస స్థల ఆనవాళ్లు, ప్రాచీన ఇటుక నిర్మాణాలు లభ్యమయ్యాయన్నారు.
తెలంగాణ వారసత్వ శాఖ సంచాలకుల ఆదేశాల మేరకు డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) డాక్టర్ పి. నాగరాజు నాయకత్వంలో అసిస్టెంట్ డైరెక్టర్లు బి. మల్లు నాయక్, బి. గంగాదేవి, సైట్ సూపర్‌వైజర్ అశ్విన్ కుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి సుమన్ చక్రవర్తిలతో కూడిన అధికారుల బృందం నవంబర్ 5 నుండి 7వ తేదీ వరకు ఈ క్షేత్రస్థాయి అన్వేషణ చేపట్టిందన్నారు.
ఈ బృందం బైరాగులగుట్ట, మొర్లకొండ వాగు పరిసర ప్రాంతాల్లో ప్రాచీన నివాస స్థలం విస్తరణ, భౌగోళిక పరిస్థితులు, ఉపరితలంపై కనిపిస్తున్న పురావస్తు అవశేషాలను పరిశీలించిందని తెలిపారు.
క్షేత్రస్థాయి సర్వేలో నాటి ప్రజల దైనందిన జీవన విధానం, కళాత్మక నైపుణ్యం, వస్తు సంస్కృతిని ప్రతిబింబించే పలు విలువైన పురావస్తువులను గుర్తించి సేకరించారని తెలిపారు. వీటిలో ముఖ్యంగా మట్టి పూసలు, బండి చక్రం, రాతి రోకలి, ఎరుపు రంగు మృణ్మయ పాత్రల పెంకులు, నలుపు-ఎరుపు రంగుల పాత్రల పెంకులు, ఎరుపు పూత కలిగిన పాత్రల పెంకులు, నలుపు మెరుగు కలిగిన పాత్రల పెంకులు వంటి పురావస్తు ఆధారాలు లభించాయని కలెక్టర్ అన్నారు.
సేకరించిన మృణ్మయ పాత్రల పెంకులపై పుష్పాలంకరణలు, బొటనవేలి ముద్రలు, తాడు ఆకారపు అలంకరణలు, పౌరాణిక ఆకృతులు, ముద్రిత అలంకరణలు గుర్తించారన్నారు.
ఈ అలంకరణలు ఆనాటి ప్రజల పాత్రల తయారీ సాంకేతిక పరిజ్ఞానం, కళాత్మక అభిరుచి, సాంస్కృతిక సంప్రదాయాలను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే ముఖ్యమైన ఆధారాలుగా భావిస్తున్నారన్నారు.
ఈ అన్వేషణలో భాగంగా బైరాగులగుట్ట పరిసరాల్లోని ప్రాచీన నివాస స్థలంలో రెండు ఇటుక నిర్మాణాల అవశేషాలను పురావస్తు బృందం గుర్తించి, వాటిలో కొంత భాగాన్ని వెలికితీసిందన్నారు.
ఈ నిర్మాణాల నిర్మాణశైలి, ఇటుకల పరిమాణం, అమరిక, వాటికి సంబంధించిన ఇతర పురావస్తు ఆధారాలపై మరింత శాస్త్రీయ పరిశోధన చేపట్టాల్సిన అవసరం ఉందని బృందం అభిప్రాయపడిందని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్ (టెక్నికల్) డాక్టర్ పి. నాగరాజు జిల్లా కలెక్టర్‌కు అన్వేషణలో గుర్తించిన వివిధ పురావస్తువులు, మృణ్మయ పాత్రల రకాలు, వాటిపై కనిపించే ప్రత్యేక అలంకరణలు, ప్రాచీన ఇటుక నిర్మాణాల వివరాలను సమగ్రంగా వివరించారు.
జిల్లా కలెక్టర్ పురావస్తు బృందం గుర్తించిన నిర్మాణాలను, సేకరించిన పురావస్తువులను పరిశీలించి, ఈ ప్రాంతానికి సంబంధించిన పురావస్తు విశేషాలను అడిగి తెలుసుకున్నారు.
నేలకొండపల్లి ప్రాంతం తెలంగాణలోని ముఖ్యమైన చారిత్రక, పురావస్తు కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన నేపథ్యంలో తాజాగా లభించిన ఈ ఆధారాలు ఈ ప్రాంత ప్రాచీన చరిత్రను, నివాస సంస్కృతిని మరింత లోతుగా అధ్యయనం చేయడానికి దోహదపడనున్నాయని, శాస్త్రీయ డాక్యుమెంటేషన్ ద్వారా మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని తెలిపారు.
కలెక్టర్ పర్యటన సందర్భంగా నేలకొండపల్లి మండల తహసీల్దార్ రాంప్రసాద్, రెవెన్యూ, పర్యాటక శాఖ అధికారులు, తెలంగాణ వారసత్వ శాఖ పురావస్తు అన్వేషణ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.




