Kothagudem: ఇంటర్ విద్యా వ్యవస్థ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!

Kothagudem: ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని జూలూరుపాడులో ఏఐవైఎఫ్ నేత ఎస్కే చాంద్ పాషా డిమాండ్ చేశారు.

Sowmya
Published on: 12 Nov 2026 4:46 PM IST
Kothagudem
X

Kothagudem: ఇంటర్ విద్యా వ్యవస్థ విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి!

Kothagudem: తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసి 10+2 విధానాన్ని అమలు చేయాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోందని,ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఏఐవైఎఫ్ రాష్ట సమితి సభ్యులు sk చాంద్ పాషా డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యారంగంలో సంస్కరణలను మేము వ్యతిరేకించడం లేదని , కానీ దశాబ్దాలుగా లక్షలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యకు పునాదిగా నిలుస్తున్న ఇంటర్మీడియట్ వ్యవస్థను కేవలం పరిపాలనా మార్పుల పేరుతో రద్దు చేయడం సరైన విధానం కాదన్నారు .

ఎంపీసీ , బైపీసీ , సీఈసీ,ఎంఈసీ వంటి గ్రూపుల ప్రత్యేకత, జేఈఈ, నీట్, ఎంసెట్ వంటి పోటీ పరీక్షలకు అవసరమైన ప్రత్యేక బోధన, ప్రయోగశాలలు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు, విద్యా ప్రమాణాలు యథావిధిగా కొనసాగుతాయా? ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల భవిష్యత్తు ఏమిటి?

ముఖ్యంగా ప్రైవేట్ జూనియర్ కళాశాలలు భవనాలు, ప్రయోగశాలలు, బోధనా సిబ్బంది, మౌలిక సదుపాయాల కోసం భారీగా పెట్టుబడులు పెట్టాయని వాటి గుర్తింపు, అనుబంధం, నిర్వహణ, విద్యార్థుల ప్రవేశాలు, ఫీజుల విధానం, యాజమాన్యాల పెట్టుబడుల భవిష్యత్తుపై స్పష్టత లేకుండా వ్యవస్థను మార్చడం వల్ల కళాశాలల మూసివేతలు, ఆర్థిక నష్టాలు, వేలాది మంది అధ్యాపకులు, ఉద్యోగుల ఉపాధికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కాంట్రాక్ట్, గెస్ట్ అధ్యాపకులతో పాటు ప్రైవేట్ కళాశాలల సిబ్బంది ఉద్యోగ భద్రతను కూడా ప్రభుత్వం విస్మరించకూడదన్నారు.

మరోవైపు ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలను కేంద్రీకరిస్తే పేద విద్యార్థులు కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని ముఖ్యంగా బాలికల భద్రత, రవాణా సమస్యలు, వికలాంగ విద్యార్థుల ఇబ్బందులు పెరిగి పేదలు, దళితులు, గిరిజనులు, మైనారిటీల పిల్లలు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.

పదో తరగతి తర్వాత విద్యార్థులు చదువు మానేయడానికి పేదరికం, హాస్టళ్ల కొరత, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఆలస్యం వంటి మూలకారణాలను పరిష్కరించకుండా విలీనాలతో డ్రాపౌట్స్ సమస్య పరిష్కారమవుతుందని భావించడం వాస్తవానికి దూరమన్నారు.

విద్య అనేది వ్యాపార వస్తువు కాదని , ప్రతి పౌరుడి హక్కు, సామాజిక మార్పుకు పునాదన్నారు . ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయకుండా పాఠశాలలు, కళాశాలలను విలీనం చేయడం, వాటి ఉనికిని ప్రశ్నార్థకం చేయడం వల్ల అంతిమంగా నష్టపోయేది సామాన్య విద్యార్థులు, పేద కుటుంబాలు, విద్యారంగంపై ఆధారపడిన ఉపాధ్యాయులు, ఉద్యోగులేనన్నారు.

అందువల్ల ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థపై తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించి, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు, విద్యార్థి,యువజన సంఘాలతో విస్తృత చర్చ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ఇంటర్మీడియట్‌లోని అన్ని గ్రూపుల ప్రత్యేకత, పోటీ పరీక్షల సన్నద్ధత, ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతం, ప్రైవేట్ కళాశాలల భవిష్యత్తు, పెట్టుబడుల రక్షణ, అధ్యాపకులు మరియు ఉద్యోగుల ఉపాధి భద్రతపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలన్నారు.

పాఠశాలల విలీనం పేరుతో ఏ గ్రామంలోనూ విద్యార్థులకు విద్యను దూరం చేయకూడదని . ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి, తరగతి గదులు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, హాస్టళ్లు, రవాణా సదుపాయాలు కల్పించాలి. స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ సకాలంలో అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Sowmya

Sowmya