Sathupalli: ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: సత్తుపల్లిలో ధర్నా!

Sathupalli: సత్తుపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం నిరసన మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ 200 పనిదినాలు, రూ.800 కూలీ ఇవ్వాలని జాజిరి శ్రీనివాస్ పిలుపు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 2 Oct 2026 4:02 PM IST
Sathupalli
X

Sathupalli: ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించాలి: సత్తుపల్లిలో ధర్నా!

సత్తుపల్లి: బిజెపి ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో తెచ్చిన విబిజి గ్రామ్ జి చట్టాన్ని రద్దు చేయాలని, పాత చట్టాన్ని యధావిధిగా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త పిలుపులో భాగంగా శుక్రవారం సత్తుపల్లి మున్సిపాలిటీ గాంధీ విగ్రహం వద్ద తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు.

ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ మాట్లాడుతూ వామపక్షాల పోరాటాల ఫలితంగా యూపీఏ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిని గ్యారెంటీ చేస్తూ తెచ్చిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా రద్దు చేసిందని దీని స్థానంలో వివిజి గ్రామ్ జి చట్టాన్ని తీసుకొచ్చిందని కొత్తగా తెచ్చిన చట్టాన్ని రద్దుచేసి పాత చట్టాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

కొత్త చట్టంలో 125 రోజులు పని దినాలు పెంచిన కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపులో భారీ కోత విధించింది అన్నారు. కేంద్రం ఇచ్చే 90% నిధుల వాటా నుండి 60 శాతం కుదించిందని, రాష్ట్ర ప్రభుత్వాల మీద 40% ఆర్థిక భారాన్ని మోపడం చూస్తే పేదలకు పని కల్పించే బాధ్యతనుండి కేంద్ర ప్రభుత్వం తప్పుకోవడంలో భాగమేనని తెలిపారు. పారదర్శకత పేరుతో రెండుసార్లు ఫోటోలు ఆన్లైన్లో అప్లోడ్ అయితేనే వేతనాలు ఇస్తామనడం ఆందోళన కలిగిస్తుందని, తక్షణం గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేశారు.

పని దినాలు 200 రోజులకు పెంచాలని రోజుకూలి 800 రూపాయలు ఇవ్వాలని, పట్టణ ప్రాంత పేదలకు పనిని విస్తరింప చేయాలన్నారు. పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి మండల అధ్యక్ష కార్యదర్శులు పిల్లి నాగమణి, కువ్వారపు లక్ష్మణరావు, బండి వేలాద్రి, ప్రజానాట్యమండలి డివిజన్ కార్యదర్శి అయినంపూడి సరందరావు, కెవిపిఎస్ మండల కార్యదర్శి దాట్ల రాంబాబు, సిఐటియు మండల నాయకులు తడికమళ్ళ రామక్రిష్ణ, సప్పిడి భాస్కర్, తోటకూర వెంకట్రావు, బెజవాడ లక్ష్మీనారాయణ, మల్లాది వెంకట్, పరమేష్, ఐద్వా మండల కమిటీ సభ్యులు సరోజినీ, ఆమని తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI