Kothagudem: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి.. ఉల్లంఘిస్తే చర్యలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు.
Kothagudem: స్కానింగ్ సెంటర్లు నిబంధనలు పాటించాలి.. ఉల్లంఘిస్తే చర్యలు!
Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని స్కానింగ్ సెంటర్లు, ఆసుపత్రులు, ల్యాబొరేటరీలు ప్రభుత్వ నిబంధనలు, వైద్య ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ సూచించారు. నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ ఆధ్వర్యంలో PCPNDT మల్టీ మెంబర్ అథారిటీ కమిటీ, క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ కమిటీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని స్కానింగ్ సెంటర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సూచించారు. తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు, లోపాలు గుర్తించిన కేంద్రాలకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.
ముఖ్యంగా PCPNDT చట్టాన్ని పకడ్బందీగా అమలు చేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని కమిటీ సభ్యులు నిర్ణయించారు.
అదేవిధంగా క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ పరిధిలోని ఆసుపత్రులు, ల్యాబొరేటరీలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, ప్రభుత్వ నిబంధనలు, నిర్దేశిత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధారించిన తర్వాతే సంబంధిత రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేయాలని నిర్ణయించారు.
ఈ సమావేశంలో PCPNDT ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాకేష్, CEA ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ రాందాస్, డిప్యూటీ DM&HO డాక్టర్ ప్రతాప్, DSP సతీష్, IMA అధ్యక్షుడు డాక్టర్ సుధాకర్ రావు, ఇండిజినస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ ప్రతినిధి డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, CHO సోమ్ల, హెల్త్ ఎడ్యుకేటర్లు రమాదేవి, పరంగిణి, జూనియర్ అసిస్టెంట్లు శ్రీధర్, దీపక్, DEO శారద తదితరులు పాల్గొన్నారు.




