Kothagudem: 2014–2026 మధ్య 918 మంది మావోయిస్టుల లొంగుబాటు!

Kothagudem: కొత్తగూడెం జిల్లాలో 2014–2026 మధ్య 829 మంది మావోయిస్టులు అరెస్ట్ కాగా, 918 మంది లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారని పోలీసు, పీఐబీ అధికారులు వెల్లడించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 14 Nov 2026 11:42 AM IST
Kothagudem
X

Kothagudem: 2014–2026 మధ్య 918 మంది మావోయిస్టుల లొంగుబాటు!

Kothagudem: ఒకప్పుడు మావోయిస్టు కార్యకలాపాలతో ప్రభావితమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రమంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని పోలీసు అధికారులు వెల్లడించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అభివృద్ధి, ఉపాధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

నక్సల్ ముక్త్ భారత్ అంశంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసు యంత్రాంగం, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని పత్రికా సమాచార కార్యాలయం (PIB) సంయుక్తంగా శుక్రవారం జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మీడియా సదస్సు నిర్వహించాయి.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం ఎస్పీ సింధు శర్మ, ఐపీఎస్, PIB జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ పాల్గొని జిల్లాలో గతంలో చోటుచేసుకున్న మావోయిస్టు కార్యకలాపాలు, పోలీసులపై దాడులు, ప్రాణనష్టం, అరెస్టులు, లొంగుబాట్లు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను వెల్లడించారు.

గతంలో మావోయిస్టుల దాడులు, హింసాత్మక ఘటనల్లో 868 మంది సామాన్య పౌరులు, 331 మంది పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్లపై దాడులు, ల్యాండ్‌మైన్ల ఏర్పాటు, పేలుళ్లు, రహదారులు, వంతెనల ధ్వంసం వంటి ఘటనలతో మారుమూల గ్రామాల ప్రజలు రవాణా, వైద్యం, విద్యా సదుపాయాలకు దూరమయ్యారని వివరించారు.

అరెస్టులు, లొంగుబాట్లలో కీలక గణాంకాలు

2014 నుంచి 2026 వరకు జిల్లా పరిధిలో 829 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఇదే కాలంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య 27 ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఫైర్ ఘటనలు చోటుచేసుకోగా 57 మంది మావోయిస్టులు మరణించినట్లు తెలిపారు. మరోవైపు 918 మంది మావోయిస్టులు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసినట్లు పేర్కొన్నారు.

లొంగిపోయిన వారికి ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస విధానం ద్వారా వ్యవసాయ భూమి, ఇంటి స్థలం, ఆర్థిక సహాయం, ఆయుధాలతో లొంగిపోయిన వారికి అదనపు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశానికి హాజరైన పలువురు మాజీ మావోయిస్టులు తమకు ప్రభుత్వం కల్పించిన పునరావాస సదుపాయాలు, స్వయం ఉపాధి అవకాశాలు, సాధారణ జీవితంలో చోటుచేసుకున్న మార్పులను మీడియా ప్రతినిధులతో పంచుకున్నారు.

మారుమూల గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, బీటీ రోడ్ల నిర్మాణం, గ్రామాలకు రవాణా సౌకర్యాల కల్పన, యువతకు ఉపాధి అవకాశాలు, స్వయం ఉపాధి కార్యక్రమాలకు ప్రోత్సాహం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చిన్న పరిశ్రమలు, రైస్ మిల్లుల ఏర్పాటుకు సహకరిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు పుస్తకాలు, స్కూల్ బ్యాగులు, స్టడీ మెటీరియల్, క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

గిరిజన మారుమూల గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా వైద్య సేవలు, మందులు అందించడంతో పాటు తాగునీటి కోసం బోర్‌వెల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వరద ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

క్రీడా పోటీలు, కమ్యూనిటీ అవుట్‌రీచ్ కార్యక్రమాల ద్వారా యువతను సానుకూల కార్యకలాపాల వైపు ప్రోత్సహిస్తూ ప్రజలకు, పోలీసులకు మధ్య నమ్మకాన్ని పెంపొందించే చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM