Kothagudem: ముర్రేడు వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం.. రక్షణ గోడకు ₹50.50 కోట్లు
Kothagudem: కొత్తగూడెం ముర్రేడు వాగు వరద ముప్పు నివారణకు రూ.50.50 కోట్లతో చేపట్టే రిటైనింగ్ వాల్ నిర్మాణ ప్రాంతాలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పరిశీలించారు.
Kothagudem: ముర్రేడు వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం.. రక్షణ గోడకు ₹50.50 కోట్లు
కొత్తగూడెం: ముర్రేడు వాగు వరద ముప్పునకు శాశ్వత పరిష్కారం చూపేలా రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను నాణ్యతా ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అధికారులను ఆదేశించారు. ముర్రేడు వాగుపై రక్షణ గోడ నిర్మాణానికి ప్రభుత్వం రూ.50.50 కోట్ల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో శనివారం ఆయన సంబంధిత శాఖల అధికారులు, స్థానిక నాయకులు, ప్రజలతో కలిసి ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు.
శ్రీనగర్, ప్రశాంతినగర్, సాయినగర్ తదితర లోతట్టు కాలనీలతో పాటు వాగు పరివాహక ప్రాంతాలను పరిశీలించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అనువైన మార్గాలను అధికారులతో కలిసి పరిశీలించి, ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. గత పాలకులు ముర్రేడు వాగు ముంపు సమస్యను పూర్తిగా విస్మరించడంతో ఏళ్ల తరబడి భారీ వర్షాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. శ్మశాన వాటికలకు వెళ్లే మార్గాలు సైతం నీటమునిగి ప్రజలు అవస్థలు పడేవారని గుర్తుచేశారు. ప్రజల కష్టాలను దృష్టిలో ఉంచుకుని రక్షణ గోడ నిర్మాణమే శాశ్వత పరిష్కారమని భావించి మూడేళ్లుగా నిరంతరం కృషి చేసి రూ.50.50 కోట్ల నిధులు మంజూరు చేయించామని తెలిపారు.
మంజూరైన నిధులతో చేపట్టే పనుల్లో ఎలాంటి రాజీ లేకుండా పటిష్టమైన సాంకేతిక ప్రమాణాలు పాటించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించి ముంపు ప్రాంతాల ప్రజలకు వరద భయం నుంచి శాశ్వత విముక్తి కల్పిస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.
ఈ పర్యటనలో నాయకులు నేరెళ్ల రమేష్, లగడపాటి రమేష్, చౌదరి, మిరియాల రాము, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.




