Sathupally: సత్తుపల్లి, అశ్వారావుపేటలో 5 వేల ఉచిత ఇళ్ల నిర్మాణం!

Sathupally: సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల ఇళ్లను ఉచితంగా నిర్మించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 3 Oct 2026 7:27 PM IST
Sathupally
X

Sathupally: సత్తుపల్లి, అశ్వారావుపేటలో 5 వేల ఉచిత ఇళ్ల నిర్మాణం!

Sathupally: సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాల్లోని నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు తాన్లా ఫౌండేషన్ భారీగా ముందుకు వచ్చింది. ఫౌండేషన్ అధినేత ఉదయ్ కుమార్ రెడ్డి తన సొంత నిధులతో సుమారు రూ.300 కోట్ల అంచనా వ్యయంతో 5 వేల ఇళ్లను ఉచితంగా నిర్మించి ఇవ్వనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సత్తుపల్లి మండలం బేతుపల్లి గంగారంలో తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గ్రామీణ ఆరోగ్య కేంద్రం, ల్యాబొరేటరీలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఎమ్మెల్యేలు మట్టా రాగమయి దయానంద్, జారే ఆదినారాయణలతో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, తాన్లా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 5 వేల ఇళ్లను నిర్మించి ఇస్తామని ఉదయ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారని తెలిపారు. రాబోయే దసరా సందర్భంగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇళ్ల స్థలాల కేటాయింపు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల కలెక్టర్లు, ఎమ్మెల్యేలను మంత్రి ఆదేశించారు.

అలాగే సత్యసాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో నారాయణపురం గ్రామంలో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని మంత్రి తెలిపారు. పేదలకు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలకు ప్రభుత్వం తరఫున సంపూర్ణ సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. సంపాదించిన సొమ్మును సమాజ శ్రేయస్సు కోసం వినియోగించడం అభినందనీయమన్నారు. కేవలం ఐదు నెలల్లోనే దాదాపు రూ.9 కోట్ల విలువైన మందులను పేదలకు ఉచితంగా లేదా సాయంగా అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు.

సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ.. గంగారంలో అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా వైద్యులు, సిబ్బంది, ఆధునిక పరికరాలతో సేవలు అందుతున్నాయని తెలిపారు. హెచ్‌బీఏ1సీ వంటి పరీక్షల ఫలితాలు గతంలో మూడు రోజులు పట్టేవని, ఇక్కడ అత్యాధునిక సాంకేతికతతో కేవలం 10 నిమిషాల్లోనే పరీక్షల ఫలితాలు అందుతున్నాయని తెలిపారు.

నిరుపేదలకు ఉచిత వైద్యం, మందులు అందించడం ద్వారా నెలకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వైద్య ఖర్చు ఆదా అవుతోందని ఆమె పేర్కొన్నారు. పేదలకు సేవ చేస్తున్న ఉదయ్ కుమార్ రెడ్డి, మహీల్ రెడ్డిలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐటీడీఏ భద్రాచలం పీవో బి. రాహుల్, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్