Sathupalli: సత్తుపల్లిలో విజయదుర్గా అయ్యప్పస్వామి 11వ వార్షికోత్సవం
Sathupalli: సత్తుపల్లి రాజీవ్ నగర్‌లోని శ్రీ విజయదుర్గా అయ్యప్పస్వామి దేవాలయ 11వ వార్షికోత్సవం, అయ్యప్ప పదునెట్టాంబడి, దుర్గామాత పడిపూజలు వైభవంగా జరిగాయి.
Sathupalli: సత్తుపల్లిలో విజయదుర్గా అయ్యప్పస్వామి 11వ వార్షికోత్సవం
సత్తుపల్లి: పట్టణంలోని రాజీవ్ నగర్‌లో కొలువుదీరిన శ్రీ విజయదుర్గా అయ్యప్పస్వామి దేవాలయ 11వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు తాటిపర్తి వీరబ్రహ్మాచార్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో అయ్యప్ప స్వామి, దుర్గామాతలకు నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను ఆధ్యాత్మిక పారవశ్యంలో ముంచెత్తాయి.
వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున దుర్గమ్మవారికి, అయ్యప్ప స్వామికి నవనీత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేపట్టారు. నారాయణ సేవలో భాగంగా మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు.
రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వామి పదునెట్టాంబడి పూజ, దుర్గామాత పడిపూజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రెండు పూజలు ఏకకాలంలో అత్యంత వైభవంగా జరగడంతో ఆలయ ప్రాంగణమంతా భక్తిమయ వాతావరణం నెలకొంది. దీపాల వెలుగులు, భక్తుల అయ్యప్ప నామస్మరణలు, అమ్మవారి భజనలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. రెండు పడిపూజలను వీక్షించేందుకు భక్తులకు రెండు కళ్లూ చాలనంత అద్భుతంగా వేడుకలు సాగాయి.మండలంలోని పరిసర గ్రామాల నుంచి అయ్యప్ప మాలధారులు, భవానీ మాలధారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని 22 వార్డుల నుంచి భక్తులు భారీగా హాజరుకావడంతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్వామివార్ల దర్శనం చేసుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ బాధ్యులు చల్లగుళ్ల నర్సింహరావు, తుమ్మూరు వెంకటరెడ్డి, పౌండ్రీ పాపారావు, ఆర్.వి.ఆర్., శ్రీకాంత్, అయ్యప్ప, సురేష్, కృష్ణారావు, అబ్దుల్లా, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భక్తుల సహకారంతో వార్షికోత్సవ వేడుకలు విజయవంతంగా ముగిశాయి.




