Yellareddypet: బండలింగంపల్లిలో విషాదం.. విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి!

Yellareddypet: బండలింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పందుల కోసం నారుమడి చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి రేపాక రమేష్ (27) అనే రైతు మృతి చెందాడు.

KALEEM, SIRICILLA
Published on: 24 Nov 2026 10:44 AM IST
Yellareddypet
X

Yellareddypet: బండలింగంపల్లిలో విషాదం.. విద్యుత్ తీగ తగిలి యువ రైతు మృతి!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. పందుల నుంచి నారుమడిని కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ తగిలి రేపాక రమేష్ (27) అనే రైతు మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన వెంకట్రాంరెడ్డి పొలాన్ని అదే గ్రామానికి చెందిన మాచర్ల నర్సింలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. యాసంగి పంట కోసం నారుమడి సిద్ధం చేయగా, పందుల నుంచి దానిని రక్షించేందుకు నారుమడి చుట్టూ విద్యుత్ తీగలు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మంగళవారం ఉదయం రమేష్ పొలం వద్దకు వెళ్లి నారుమడిలోని నీటిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా విద్యుత్ తీగను గమనించకపోవడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.

మృతుడికి తల్లిదండ్రులు ఉన్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ వివరాలను ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ గౌడ్ వెల్లడించారు.

రైతుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా పంటల రక్షణ కోసం పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రైతు రమేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బండలింగంపల్లి సర్పంచ్ బాలరాజు నర్సగౌడ్, కాంగ్రెస్ నాయకులు మార్పు సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ, మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు దడిగల పరశురాం రెడ్డి కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA