Yellareddypet: డివైడర్ కటింగ్‌పై అభ్యంతరం.. ప్రాణాలకు ముప్పు!

Yellareddypet: ఎల్లారెడ్డిపేట హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద రాంగ్ రూట్‌లో డివైడర్ కటింగ్ చేస్తే ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని స్థానిక గ్రామస్తుడు చందుపట్ల లక్ష్మారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Nov 2026 1:14 PM IST
Yellareddypet
X

Yellareddypet: డివైడర్ కటింగ్‌పై అభ్యంతరం.. ప్రాణాలకు ముప్పు!

Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో డివైడర్ కటింగ్‌కు అధికారులు చేపడుతున్న చర్యలపై స్థానిక గ్రామస్తుడు చందుపట్ల లక్ష్మారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. పెట్రోల్ బంక్‌కు వెళ్లేందుకు రాంగ్ రూట్‌లో డివైడర్ కటింగ్‌కు అనుమతులు ఇవ్వడం ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో ఇదే ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పది మందికి పైగా బాధితులు కాగా, నలుగురు మృత్యువాత పడ్డారని లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రమాదాల కారణంగా పలు కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయని తెలిపారు. గతంలో ప్రమాదాల తీవ్రతను పరిగణనలోకి తీసుకొని రాంగ్ రూట్‌లో ఉన్న డివైడర్ కటింగ్‌ను తొలగించాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

అయితే, గతంలో తీసుకున్న నిర్ణయానికి విరుద్ధంగా, ప్రస్తుతం సుమారు పది మీటర్ల దూరంలో మరోసారి డివైడర్ కటింగ్‌కు మార్కింగ్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఆర్ అండ్ బీ అధికారులను ప్రశ్నించగా, ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు మార్కింగ్ చేస్తున్నామని, ఇది రాంగ్ రూట్‌లోనే ఉందని అధికారులు చెప్పినట్లు లక్ష్మారెడ్డి తెలిపారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ స్వయంగా హెచ్‌పీ పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితులను పరిశీలించాలని ఆయన కోరారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలకు కారణమయ్యే డివైడర్ కటింగ్ ప్రతిపాదనను నిలిపివేసి, గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA