Karimnagar: భూ సమస్యపై మీడియా సమావేశం నిర్వహించిన బాధితుడు రవీందర్!
Karimnagar: కరీంనగర్‌లో అజీమ్ గెస్ట్‌హౌస్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన అసోద రవీందర్. తమ భూ సమస్యను పరిష్కరించాలని, కలెక్టరేట్ ఎదుట దీక్ష చేపడతామని హెచ్చరిక.
Karimnagar: భూ సమస్యపై మీడియా సమావేశం నిర్వహించిన బాధితుడు రవీందర్!
Karimnagar: తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అసోదా రవీందర్ కరీంనగర్ నగరంలోని అజీమ్ గెస్ట్‌హౌస్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తమ కుటుంబ భూ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ఆయన తెలిపిన వివరాల ప్రకారం తమ కుటుంబానికి చెందిన సర్వే నంబర్ 179లోని పట్టా భూమిని ప్రభుత్వ భూమిగా ధరణిలో పేర్కొంటూ జాబితాలో చేర్చారని తెలిపారు. ఈ విషయంపై తమ తమ్ముడు అసోద రాజయ్య 2022లో అన్ని ఆధారాలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందని పేర్కొన్నారు.
కోర్టు తీర్పు ప్రతితో పాటు సంబంధిత ఆధారాలను జిల్లా కలెక్టర్‌కు అందజేసినా ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదని రవీందర్ ఆరోపించారు. ఇప్పటివరకు సుమారు 18 సార్లు అధికారులకు దరఖాస్తులు సమర్పించినట్లు తెలిపారు.
ఈ నెల 5వ తేదీన తమ తమ్ముడు రాజయ్య కూడా కలెక్టర్‌కు దరఖాస్తు సమర్పించారని, అదే రోజు తీవ్ర మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారని రవీందర్ తెలిపారు. అయితే రాజయ్య మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని తాము భావిస్తున్నామని ఆరోపించారు. క్రింది స్థాయి అధికారులు, కొత్తగా వచ్చిన ఆర్డీఓ షర్మిలతో సహా తమకు అనుకూలంగా నివేదికలు ఇచ్చారని, సమస్య పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఒక్క సంతకం చేస్తే సరిపోతుందని పేర్కొన్నారు. పలుమార్లు కలెక్టర్‌ను కలిసి సమస్యను వివరించినప్పటికీ పరిష్కారం కాలేదని ఆరోపించారు.
సమస్య పరిష్కారంలో జాప్యం చేస్తున్నారంటూ కలెక్టర్‌పై సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేసినట్లు రవీందర్ తెలిపారు. అలాగే మంత్రి శ్రీధర్‌బాబు, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తమకు లేఖలు ఇచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని పేర్కొన్నారు.
తాము దళితులమనే కారణంతోనే తమ సమస్యను అధికారులు పట్టించుకోవడం లేదని రవీందర్ ఆరోపించారు. ఈ నెల 30వ తేదీన ముఖ్యమంత్రి కరీంనగర్ పర్యటనకు వచ్చిన సమయంలో అవకాశం లభిస్తే ఆయనను కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు. అలాగే చట్టపరమైన అనుమతులు తీసుకుని వచ్చే నెల 3వ తేదీన కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి నిరాహార దీక్ష, నిరసన చేపట్టనున్నట్లు రవీందర్ వెల్లడించారు. తమ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి, కోర్టు తీర్పు మేరకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.




