Vemulawada: మార్కెట్ కమిటీ అభివృద్ధికి ₹3.94 కోట్లు మంజూరు
Vemulawada: వేములవాడ మార్కెట్ కమిటీకి ₹3.94 కోట్లు మంజూరయ్యాయి. మర్రిపల్లి వద్ద 12 ఎకరాల్లో మోడల్ యార్డ్ నిర్మిస్తున్నట్లు చైర్మన్ రొండి రాజు వెల్లడించారు.
Vemulawada: మార్కెట్ కమిటీ అభివృద్ధికి ₹3.94 కోట్లు మంజూరు
వేములవాడ: వేములవాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ₹3.94 కోట్లు (₹3,94,40,000) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ హర్షం వ్యక్తం చేశారు. గురువారం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... స్థానిక శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ, కృషితోనే ఈ నిధులు మంజూరయ్యాయని తెలిపారు.
వేములవాడ రూరల్ మండలం మర్రిపల్లి గ్రామంలో మార్కెట్ యార్డ్ ఏర్పాటుకు స్థలం అవసరమని తెలపగానే, ఎమ్మెల్యే సూచనతో జిల్లా కలెక్టర్ స్పందించి 12 ఎకరాల భూమిని కేటాయించారని చెప్పారు. ఆ స్థలంలో ఏఎంసీ భవనం, కార్యదర్శి భవనం, నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణానికి సంబంధించి దాదాపు రూ.7 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలను ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరియు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి సమర్పించగా, ప్రభుత్వం రూ.3.94 కోట్లను విడుదల చేసిందని వివరించారు.
మంజూరైన ఈ నిధులతో మర్రిపల్లి నూతన మార్కెట్ యార్డ్‌తో పాటు వేములవాడ యార్డ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు మొత్తం 11 రకాల అభివృద్ధి పనులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చిందని చైర్మన్ తెలిపారు. మర్రిపల్లి మార్కెట్ యార్డ్‌లో జంగిల్ క్లియరెన్స్, మైదానం సమం చేయడం, చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం, ఆర్ఓ ప్లాంట్ ద్వారా తాగునీటి సరఫరా, పురుషులు-మహిళలకు శౌచాలయాలు, ఆర్ అండ్ బి రోడ్డు నుండి అప్రోచ్ రోడ్డు, విద్యుదీకరణ పనులు మరియు హైమాస్ట్ లైట్ల ఏర్పాటు చేపడుతున్నట్లు వెల్లడించారు.
దీనితో పాటు వేములవాడ మార్కెట్ యార్డ్‌లోని కవర్డ్ షెడ్‌ను 20 నూతన వ్యాపార గదులుగా మార్చే పనులు కూడా పూర్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. రైతులు పండించిన పంటను విక్రయించుకోవడానికి మార్కెట్ యార్డ్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని, ఈ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
వేములవాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మోడల్‌గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో దాదాపు రూ.1,000 కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని రొండి రాజు కొనియాడారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సమగ్ర అభివృద్ధికి రూ.250 కోట్లు, ఆలయానికి చేరుకునే 80 ఫీట్ల విస్తరణ రోడ్డు నిర్మాణానికి రూ.46 కోట్లు వెచ్చించి అభివృద్ధి పనులు వేగవంతం చేస్తున్నామని వెల్లడించారు.
రైతాంగ సంక్షేమం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రమించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ లకు మార్కెట్ కమిటీ పాలకవర్గం, డైరెక్టర్లు మరియు నియోజకవర్గ రైతుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ కార్యదర్శి సరోజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ డైరెక్టర్లు దైత కుమార్, ఖమ్మం గణేష్, గుర్రం విద్యాసాగర్, మ్యాక స్రవంతి హరి నందన్ రెడ్డి, కత్తి కనకయ్య, వస్తాద్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.




