Vemulawada: వేములవాడలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం
Vemulawada: వేములవాడలో బతుకమ్మ వేడుకలకు రూ.34 లక్షలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మూలవాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు.
Vemulawada: వేములవాడలో బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం
వేములవాడ: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను వేములవాడలో ఘనంగా నిర్వహించేందుకు మున్సిపల్ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
గురువారం వేములవాడ పట్టణంలో బతుకమ్మ పండుగ సందర్భంగా ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నాయకులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్ చైర్మన్ నరాల శేఖర్, మున్సిపల్ అధికారులతో కలిసి పరిశీలించారు.
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ బతుకమ్మ నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సుమారు రూ.34 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీల పరిధిలో బతుకమ్మ పండుగ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజన్న సన్నిధిలో ఏడు రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజులపాటు, కొన్ని ప్రాంతాల్లో 11 రోజులపాటు బతుకమ్మ పండుగ జరుపుకుంటారని వివరించారు.
వేములవాడలో ఏడు రోజులపాటు బతుకమ్మ వేడుకలు నిర్వహించడం వల్ల ఆడబిడ్డలకు పుట్టింట్లోనూ, మెట్టినింట్లోనూ బతుకమ్మ పండుగలో పాల్గొనే అవకాశం లభిస్తోందని అన్నారు. ప్రకృతిని ఆరాధిస్తూ తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి, గౌరమ్మను ప్రతిష్ఠించి కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఎలాంటి కీడు కలగకూడదని మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను ఆడుతూ నిమజ్జనం చేస్తారని చెప్పారు.
ఈ పండుగ ఆడబిడ్డల పండుగ అని, మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడేందుకు పురుషులు వారికి తోడుగా నిలుస్తారని పేర్కొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే ఈ పండుగ ప్రకృతిని గౌరవించడం, పూలను ఆరాధించడం వంటి గొప్ప సందేశాన్ని అందిస్తుందని అన్నారు.
బతుకమ్మ నిమజ్జనోత్సవానికి వేలాది మంది మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మూలవాగు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. నిమజ్జన కార్యక్రమం కోసం విశాలమైన ప్రదేశాన్ని సిద్ధం చేయడంతోపాటు, భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశామన్నారు. బతుకమ్మ గార్డెన్ను సైతం సుందరంగా తీర్చిదిద్దినట్లు వివరించారు.
నిమజ్జనోత్సవానికి 35 వేల మందికి పైగా మహిళలు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉండటంతో పోలీసు బందోబస్తుతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
వేములవాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు గత వారం రోజులుగా శ్రమించి బతుకమ్మ వేడుకలకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని తెలిపారు.
రేపు జరిగే బతుకమ్మ నిమజ్జనోత్సవానికి వచ్చే మహిళలు, ఆడబిడ్డలందరికీ స్వాగతం పలుకుతున్నామని ఆయన అన్నారు. బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు.




