Vemulawada: బాలల రక్షణ అందరి బాధ్యత: జడ్జి అజయ్ కుమార్ జాదవ్!
Vemulawada: వేములవాడ బాలికల ఉన్నత పాఠశాలలో రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో పోక్సో చట్టం, బాలల రక్షణపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
Vemulawada: బాలల రక్షణ అందరి బాధ్యత: జడ్జి అజయ్ కుమార్ జాదవ్!
వేములవాడ: బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంతో పాటు, వారి హక్కులు, భద్రతను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్ కుమార్ జాదవ్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములవాడ పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్లో పోక్సో (POCSO) చట్టంపై న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి అజయ్ కుమార్ జాదవ్ మాట్లాడుతూ.. బాలలపై జరిగే లైంగిక వేధింపులను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. బాలలకు రక్షణ కల్పించేందుకు పోక్సో చట్టం రూపొందించబడిందని తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని విద్యార్థులకు సూచించారు.
అనంతరం డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ.. బాలల భద్రతకు పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. బాలలపై వేధింపులు లేదా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే నిర్లక్ష్యం చేయకుండా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. విద్యార్థులు తమకు ఎదురయ్యే సమస్యలను నమ్మకమైన పెద్దలతో పంచుకోవాలని, బాలల రక్షణలో ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు పిట్టల మనోహర్ మాట్లాడుతూ.. బాలల హక్కులు, భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇలాంటి న్యాయ అవగాహన కార్యక్రమాలు బాలల్లో ధైర్యాన్ని పెంపొందించడంతో పాటు చట్టాలపై అవగాహన కల్పిస్తాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ కోర్టు ఏపీపీ, ఏజీపీ అవధూత రజనీకాంత్, బొడ్డు ప్రశాంత్ కుమార్, న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడు గొంటి శంకర్, జాయింట్ సెక్రటరీ కనికరపు శ్రీనివాస్, మహిళా ప్రతినిధి తమిరి అన్నపూర్ణ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నాయిమా నాసారి, వడ్లకొండ శ్రీకాంత్, న్యాయవాదులు కుంట శ్రీనివాస్, రేగుల రాజ్ కుమార్, బీమా మహేష్ బాబు, నాగేంద్ర, అర్బన్ ఎంఈఓ సదానందం, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బన్నాజీ, ఉపాధ్యాయులు, సీఆర్పీ ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.




