Vemulawada: దక్షిణ కాశీ వేములవాడను కమ్మేసిన పొగమంచు.. వాహనదారుల ఇబ్బందులు!

Vemulawada: వేములవాడలో ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. ప్రధాన రహదారులపై దృశ్యమానత తగ్గడంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.

BABU, VEMULAWADA
Published on: 22 Nov 2026 11:59 AM IST
Vemulawada
X

Vemulawada: దక్షిణ కాశీ వేములవాడను కమ్మేసిన పొగమంచు.. వాహనదారుల ఇబ్బందులు!

Vemulawada: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణాన్ని ఆదివారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం వేళ పట్టణమంతా మంచు దుప్పటి కప్పుకున్నట్లుగా మారింది. దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లు, ఇళ్లు సైతం కొద్ది దూరం వరకు కనిపించని పరిస్థితి నెలకొంది.

పట్టణంలోని ప్రధాన కూడళ్లు, అంతర్గత రహదారులు పొగమంచుతో కప్పుకుపోవడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వేములవాడ నుంచి వరంగల్, హైదరాబాద్, కోరుట్ల, జగిత్యాల వైపు వెళ్లే ప్రధాన రహదారులపై దృశ్యమానత తగ్గిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఉదయం వేళ విధులకు వెళ్లేవారు, ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు వాహనాల లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల భయం నెలకొంది.

చలికాలం ప్రభావంతో తెల్లవారుజామున పొగమంచు తీవ్రత పెరుగుతుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని నియంత్రించుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రధాన రహదారులపై ప్రయాణించే వారు ఫాగ్ లైట్లు, వాహనాల హెడ్‌లైట్లు వినియోగిస్తూ తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది.

ఒకవైపు చల్లని వాతావరణం, మరోవైపు దట్టమైన పొగమంచుతో వేములవాడ పట్టణం ప్రకృతి అందాలతో కనువిందు చేసినప్పటికీ.. రహదారులపై మాత్రం వాహనదారులకు సవాలుగా మారింది.

BABU, VEMULAWADA

BABU, VEMULAWADA