Jagtial: కోరుట్ల ఎమ్మెల్యేపై జువ్వాడి నర్సింగరావు తీవ్ర ఆరోపణలు!

Jagtial: కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్‌పై వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తీవ్ర ఆరోపణలు చేశారు.

GUJJETI SRINIVAS, KORUTLA
Published on: 18 Nov 2026 11:58 AM IST
Jagtial
X

Jagtial: కోరుట్ల ఎమ్మెల్యేపై జువ్వాడి నర్సింగరావు తీవ్ర ఆరోపణలు!

Jagtial: జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది. మెట్టుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు... స్థానిక ఎమ్మెల్యే సంజయ్ మరియు బీఆర్ఎస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

మున్సిపల్ కార్మికులను ఇంటి పనులకు వాడుకోవడం నుండి భూ కబ్జాలు, ఫోన్ ట్యాపింగ్ వరకు పలు సంచలన ఆరోపణలు చేశారు. నిన్న కాంగ్రెస్ కార్యకర్తలపై జరిగిన దాడిని ఖండిస్తూ, దీనిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

​కోరుట్ల నియోజకవర్గంలో గత 13 ఏళ్లుగా మున్సిపల్ కార్మికులను ఎమ్మెల్యే ఇంటి పనులకు వినియోగించుకుంటున్నారని జువ్వాడి నర్సింగరావు ఆరోపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏ ఎమ్మెల్యే వద్ద ఐదుగురు మున్సిపల్ కార్మికులు పనిచేయలేదని, ప్రభుత్వం లక్షల్లో జీతాలు ఇస్తుంటే కార్మికులను సొంత పనులకు వాడుకోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

దీనిపై శాంతియుతంగా ఎమ్మెల్యేను ప్రశ్నించడానికి వెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నాయకులు, కిరాయి గుండాలు భౌతిక దాడులకు దిగారని నర్సింగరావు మండిపడ్డారు.

​ఫోన్ ట్యాపింగ్ సహకారంతో గెలిచారని జువ్వాడి నర్సింగరావు విమర్శించారు. ఆయనకు రాజకీయ అనుభవం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ నేతలను విమర్శించడం తప్ప నియోజకవర్గానికి చేసిందేమీ లేదని అన్నారు.

గత 18 ఏళ్లుగా నియోజకవర్గంలో భూ కబ్జాలు, ఖాదీ బోర్డు భూములు, మెట్టుపల్లి క్లబ్ విక్రయాలు వంటి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కేవలం గోడలు మాత్రమే ఉన్న ఆసుపత్రిని హడావిడిగా ప్రారంభించారని, డాక్టర్లను సస్పెండ్ చేయించి మళ్లీ పోస్టింగ్ ఇప్పిస్తామని నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు.

​​తాము వీకెండ్ రాజకీయాలు చేసేవాళ్లం కాదని, హైదరాబాద్ నుండి వచ్చి ఇక్కడ గెలిచిన సంజయ్ ముందుగా 'నాన్ లోకల్' కిందకు వస్తారని నర్సింగరావు కౌంటర్ ఇచ్చారు. 'పరాన్నజీవి' అనే పదానికి అర్థం తెలుసా అని ప్రశ్నిస్తూ, బీఆర్ఎస్ అగ్రనేతలపైనా ఆయన విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మెల్యే సొంత నియోజకవర్గంలోనే 20 వేల ఓట్లు కూడా రాలేదని, కాంగ్రెస్‌కు 60 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.

​ఉనికిని కాపాడుకునేందుకే బీఆర్ఎస్ నాయకులు రౌడీ రాజకీయాలు, భౌతిక దాడులకు పాల్పడుతున్నారని నర్సింగరావు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను సహించేది లేదని, బాధ్యులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

GUJJETI SRINIVAS, KORUTLA

GUJJETI SRINIVAS, KORUTLA