Sircilla: అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

Sircilla: తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లో నూతన అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమ అగ్రవాల్, అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 5:41 PM IST
Sircilla
X

Sircilla: అంగన్వాడీ కేంద్రాల సేవలను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

Rajanna Sircilla: పిల్లల ఆరోగ్యం, ఎదుగుదలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ప్రతిరోజూ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు క్రమం తప్పకుండా పంపించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌లో నూతనంగా నిర్మించిన అంగన్వాడీ కేంద్ర భవనాన్ని గురువారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పిల్లలకు పోషకాహారంతో పాటు ఆటలు, పాటలు, బొమ్మల ద్వారా ప్రాథమిక విద్యాబోధన అందిస్తున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లలను ప్రతిరోజూ కేంద్రాలకు పంపించాలని సూచించారు. చిన్నారులకు మొదటి నుంచే సరైన పోషకాహారం అందించి వారి ఎదుగుదలకు తోడ్పడాలని పేర్కొన్నారు. అంగన్వాడీ కేంద్రాన్ని ఆహ్లాదకరంగా తీర్చిదిద్దిన సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.

తీవ్రమైన, మధ్యస్థ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, తక్కువ బరువుతో బాధపడుతున్న చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. ఇలాంటి పిల్లలకు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పోషకాహారం అందించడంతో పాటు బాలామృతం ప్లస్ పంపిణీ చేస్తున్నట్లు వివరించారు.

అలాగే ప్రతి మంగళవారం అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో '10 నిమిషాలు' కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో సేవలు, వసతుల మెరుగుదల, పోషకాహార పంపిణీ, బాలల హక్కుల పరిరక్షణ, మౌలిక వసతుల కల్పనపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, ఇన్‌చార్జి తహసీల్దార్ మురళి, ఎంపీడీఓ రమేష్, సర్పంచ్ మోర నిర్మల తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA