Karimnagar: కరీంనగర్లో వినూత్న దీపావళి: శ్మశానంలో దీపాల వెలుగులు
Karimnagar: కరీంనగర్లోని కార్ఖానా గడ్డ వైకుంఠధామంలో పూర్వీకుల స్మారకార్థం సమాధులను ముగ్గులు, పూలతో అలంకరించి దీపాలు వెలిగించి వినూత్నంగా దీపావళి జరుపుకున్నారు.
Karimnagar: కరీంనగర్లో వినూత్న దీపావళి: శ్మశానంలో దీపాల వెలుగులు
కరీంనగర్: చీకట్లను పారద్రోలుతూ ఆనందాలు పంచే దీపావళి పండుగను సాధారణంగా అందరూ ఇళ్లల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జరుపుకుంటారు. కానీ, కరీంనగర్లోని కార్ఖానా గడ్డ వైకుంఠధామంలో మాత్రం ఇందుకు భిన్నమైన, భావోద్వేగభరితమైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ లోకం విడిచి వెళ్లిన తమ పూర్వీకుల జ్ఞాపకార్థం స్థానికులు ఇక్కడ దీపావళి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
పండుగ రోజు సాయంత్రం రాత్రి వరకు స్థానికులంతా పెద్ద సంఖ్యలో శ్మశాన వాటికకు చేరుకున్నారు. తమ ప్రియమైన వారి సమాధులను శుభ్రం చేసి, సుందరమైన రంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. పూలతో అలంకరించి, వారి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించారు. అనంతరం సమాధుల చుట్టూ మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించి, బాణసంచా కాల్చారు. తమను కంటికి రెప్పలా కాపాడిన పెద్దల ఆత్మలకు ఈ రూపంలో నివాళులర్పించారు.
మరణం అంతం కాదని, జ్ఞాపకాలు శాశ్వతమనే సందేశాన్ని ఈ వినూత్న సంప్రదాయం చాటుతోంది. విషాదాన్ని పక్కనపెట్టి, మరణించిన వారిపై ఉన్న అమితమైన ప్రేమను దీపాల రూపంలో వెలిగిస్తూ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఈ ఆచారం అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈ అరుదైన వేడుక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ఇక్కడికి చేరుకున్న కొంతమంది మాట్లాడుతూ తమ వారు మరణించారు అని అయినా వారి జ్ఞాపకాలు ఈ రూపంలో మేము ఎప్పుడు గుర్తు చేసుకుంటామని అన్నారు. వారికి ఇష్టమైన వంటకాలతో పాటు, దీపాలు వెలిగించి టపాసులు కాలుస్తామన్నారు. కుటుంబంలోని అందరము కలిసి ఆనందంగా ఈ సమాధుల వద్ద పండగ వాతావరణంలో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని వారి ఆశీర్వాదాలు పొందుతామని తెలిపారు.
ఇది తమ పూర్వికుల నుండి వచ్చిన ఆచారమని ఇది ఇలాగే కొనసాగుతుందని, గత ఆరు దశాబ్దాలుగా ఈ ఆచారం నిర్వహిస్తున్నామని చెప్పారు. తమ తాతలు తండ్రులు గతించిన వారి జ్ఞాపకాలు ఎప్పటికీ పదిలంగా ఉంటాయన్నారు. ఉదయం నుండి కొనసాగుతున్న ఈ దీపావళి సమాధుల పండగ రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుందని అన్నారు.
ఈ ఆచారం కరీంనగర్ లో తప్ప మరిక్కడ లేదని ఈ ఆచారం ఎలా మొదలైందో తెలియదు కానీ మేము మాత్రం దీన్ని ఇలాగే కొనసాగిస్తామని చెప్పారు. చనిపోయిన తమ పూర్వీకులు తమ మధ్య లేకున్నా ఈ సమాధుల వద్దకు వచ్చినప్పుడు వాళ్లతో ఉన్నట్లుగానే మేము భావిస్తామని తెలిపారు. అందుకే ఇక్కడే పండగ చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు.




