Sircilla: గణేశ్ నిమజ్జనానికి నీళ్లు లేవు: బండి సంజయ్ తీవ్ర విమర్శలు!
Sircilla: గణేశ్ నిమజ్జనానికి చెరువులు, కాలువల్లో నీళ్లు లేవని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. సీఎం రేవంత్, కేటీఆర్ కుమ్మక్కయ్యారని సిరిసిల్ల ప్రెస్‌మీట్‌లో తీవ్ర ఆరోపణలు.
Sircilla: గణేశ్ నిమజ్జనానికి నీళ్లు లేవు: బండి సంజయ్ తీవ్ర విమర్శలు!
సిరిసిల్ల: సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ విగ్రహాల నిమజ్జనోత్సవాలకు నీటి కొరత ఉందని ఆయన అన్నారు. కాలువలు, చెరువులు ఎండిపోయాయని, ఎస్సారెస్పీ పరిధిలోని కాలువల్లోనూ నీళ్లు లేవని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, సీఎం వెంటనే జోక్యం చేసుకుని తక్షణమే కాలువలకు నీళ్లు విడుదల చేయాలని కోరారు.
హిందూ పండుగలను చులకనగా చూస్తే ఊరుకునేది లేదని బండి సంజయ్ అన్నారు. కాలువలకు నీళ్లు విడుదల చేయకపోతే వినాయక విగ్రహాలను రోడ్లపై ఉంచాల్సిన పరిస్థితి వస్తుందని, తద్వారా శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పరిస్థితి చేయి దాటకముందే నిమజ్జనోత్సవాలపై సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రైవేట్ భూముల్లోకి వెళ్లే అధికారం ఎవరికీ లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఆ విషయం గుర్తున్నట్లు లేదని విమర్శించారు. ప్రభుత్వం వద్ద అన్ని ఆధారాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకునే దమ్ము లేదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లక్ష కోట్ల భూదోపిడీ చేసిందని తేల్చడానికి మూడేళ్లు పట్టిందా అని నిలదీశారు. సీఎం స్థాయి వ్యక్తి తలుచుకుంటే మూడు గంటల్లో అన్ని ఆధారాలను బయటపెట్టవచ్చని అన్నారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ దోస్తులని వ్యాఖ్యానించారు. అందుకే భూదోపిడీ పేరుతో టైం పాస్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏఐసీసీకి ఈఎంఐ కట్టేందుకు సీఎం భూదోపిడీ అంశాన్ని అడ్డుపెట్టుకుని బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు.
సిరిసిల్లలో 8 వేల ఎకరాలను బీఆర్ఎస్ కబ్జా చేసిందనడానికి ఆధారాలు ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు. ఆధారాలు చూపిస్తే తామే ఆ భూములను రక్షిస్తామని, వాటిని పేదలకు పంచాలని అన్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. దమ్ముంటే బీఆర్ఎస్ నేతల రూ.లక్ష కోట్ల భూదోపిడీకి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను బయటపెట్టాలని, లేకపోతే తప్పు చేశామని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆరు గ్యారంటీలు, తెలంగాణ అభివృద్ధిపై చర్చ జరగకుండా అసెంబ్లీలో రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీ ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని, ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి చేయి దాటిపోయిందని వ్యాఖ్యానించారు.
రాష్ట్రవ్యాప్తంగా గణేశ్ నిమజ్జనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని బండి సంజయ్ తెలిపారు. మహారాష్ట్ర తర్వాత అత్యంత ఘనంగా నిమజ్జనోత్సవాలు జరిగేది తెలంగాణలోనే అన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా భక్తియుత వాతావరణంలో నిమజ్జనోత్సవాల్లో పాల్గొనాలని సూచించారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మకుండా అధికారులకు సహకరిస్తూ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా గణేశ్ నిమజ్జనోత్సవాలు విజయవంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని బండి సంజయ్ కోరారు. నిమజ్జనోత్సవాలపై సీఎం స్థాయిలో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.




