Metpally: గర్భిణికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడిన త్రిశక్తి దీక్షా స్వాములు!
Metpally: మెట్టుపల్లి శ్రీ త్రిశక్తి దేవాలయ దీక్షా స్వాములు నిరుపేద గర్భిణికి అత్యవసరంగా రక్తం దానం చేసి ప్రాణాలను కాపాడారు. స్వాముల ఉదారతపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
Metpally: గర్భిణికి రక్తం దానం చేసి ప్రాణాలు కాపాడిన త్రిశక్తి దీక్షా స్వాములు!
Metpally: మానవసేవే మాధవసేవ అనే నానుడిని నిజం చేస్తూ, నిరుపేద గర్భిణి ప్రాణాలను కాపాడి దైవభక్తితో పాటు సామాజిక బాధ్యతను చాటుకున్నారు మెట్టుపల్లి శ్రీ త్రిశక్తి దేవాలయ దీక్షా స్వాములు.
మెట్టుపల్లి పట్టణంలోని రేగుంట ప్రాంతానికి చెందిన తెడ్డు లాస్య అనే గర్భిణికి అత్యవసరంగా శస్త్రచికిత్స (ఆపరేషన్) నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు అత్యవసరంగా ‘O పాజిటివ్’ (O+ve) రక్తం అవసరమైంది. బ్లడ్ బ్యాంక్లో రక్తం దొరకక, ఎటు పాలుపోని స్థితిలో ఉన్న బాధితురాలి కుటుంబ సభ్యులు త్రిశక్తి దేవాలయంలో దీక్ష తీసుకుని సేవలో ఉన్న దీక్షా స్వాములు ఉషకోల ధనుష్, ఆడెపు రాజేష్లను సంప్రదించారు.
బాధితుల పరిస్థితిని అర్థం చేసుకున్న సదరు దీక్షా స్వాములు, తమ దీక్షా నియమాలను పాటిస్తూనే తక్షణమే స్పందించి ఆసుపత్రికి వెళ్లారు. సమయానికి రక్తం దానం చేసి గర్భిణి ప్రాణాలను కాపాడారు. స్వాముల సమయస్ఫూర్తి, ఉదారతపై స్థానికులు, బాధితురాలి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
అత్యవసర సమయంలో స్పందించి మహిళ ప్రాణాలను కాపాడిన రక్తదాతలైన దీక్షా స్వాములను త్రిశక్తి దేవాలయ కమిటీ నాయకులు ద్యావనపెల్లి రాజారాం, అన్నం నాగరాజు, గుజ్జేటి శ్రీనివాస్, బేతు భాస్కర్ తదితరులు ప్రత్యేకంగా అభినందించారు. భక్తితో పాటు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, స్వాములు చేసిన ఈ సేవా కార్యక్రమం అందరికీ ఆదర్శనీయమని దేవాలయ కమిటీ సభ్యులు కొనియాడారు.




