Manthani: మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

Manthani: మంథని పాత పెట్రోల్ బంకు వద్ద ఇసుక లారీ ఢీకొని మల్లెపల్లికి చెందిన పండ్ల విక్రయదారుడు చింతల నవీన్ కుమార్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు.

SHANKAR, MANTHANI
Published on: 25 Oct 2026 6:02 PM IST
Manthani
X

Manthani: మంథనిలో ఘోర రోడ్డు ప్రమాదం.. యువకుడు మృతి

మంథని: పెద్దపల్లి జిల్లా, మంథని పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాత పెట్రోల్ బంకు వద్ద ఇసుక లారీ ఢీకొని మల్లెపల్లి గ్రామానికి చెందిన చింతల నవీన్ కుమార్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు.

వివరాల్లోకి వెళ్తే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి ఇసుక క్వారీ నుంచి మంథని మీదుగా నిజామాబాద్‌కు వెళ్తున్న టీజీ 16 టి 5899 నంబర్ గల ఇసుక లారీ.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న నవీన్ కుమార్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ టైర్లు అతడిపై నుంచి వెళ్లడంతో మృతదేహం తీవ్రంగా ఛిద్రమైంది.

నవీన్ కుమార్ మంథని పట్టణంలోని ఓ పండ్ల దుకాణం యజమాని వద్ద జీతానికి పనిచేస్తూ పండ్లు విక్రయించేవాడు. కొద్దిసేపటి క్రితం పాత పెట్రోల్ బంకు వద్ద పండ్లు అమ్మిన అనంతరం నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఇసుక లారీతో పాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మంథని పట్టణంలో జరిగిన ఈ ప్రమాదంతో స్థానికంగా విషాదం నెలకొంది.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI