Peddapalli: ఓదెలలో మూడు వ్యవసాయ మోటార్ల చోరీ, కెనాల్ వెంట రైతుల ఆందోళన!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిర గ్రామంలో మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లు చోరీకి గురవ్వడంతో ఆందోళన చెందుతున్న రైతులు, రాత్రివేళ గస్తీ పెంచాలని విజ్ఞప్తి.
Peddapalli: ఓదెలలో మూడు వ్యవసాయ మోటార్ల చోరీ, కెనాల్ వెంట రైతుల ఆందోళన!
Peddapalli: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామం D-86 కెనాల్ పరిసరాల్లో శుక్రవారం రాత్రి గుర్తుతెలియని దుండగులు మూడు వ్యవసాయ విద్యుత్ మోటార్లను చోరీ చేశారు. నిత్యం పంటలకు సాగునీరు అందించే మోటార్లు మాయమవ్వడంతో స్థానిక రైతుల్లో తీవ్ర కలవరం నెలకొంది.
చిన్న కొమిర గ్రామానికి చెందిన కాసర్ల రాజి రెడ్డి, సదువు శ్రీనివాస్ రెడ్డిలతో పాటు పెద్ద కొమిర గ్రామానికి చెందిన కేశిరెడ్డి లక్ష్మారెడ్డిలకు చెందిన మోటార్లు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు. శనివారం ఉదయం పొలాలకు నీరు పెట్టేందుకు వచ్చిన రైతులకు మోటార్లు కనిపించకపోవడంతో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే గ్రామంలోని మంచినీటి బావి ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు ఎత్తుకెళ్లిన సంఘటన మరువకముందే మళ్లీ ఈ చోరీ జరగడంతో గ్రామంలో ఆందోళన వ్యక్తమవుతోంది.
కెనాల్ పరిసరాల్లో రాత్రివేళ నిఘా లేకపోవడమే దొంగతనాలకు కారణమని, దీనివల్ల పంటలకు నీరందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతులు వాపోతున్నారు. తక్షణమే పోలీసులు స్పందించి దర్యాప్తు వేగవంతం చేయాలని, చోరీకి పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కెనాల్ పరిసర ప్రాంతాల్లో రాత్రివేళ పోలీస్ గస్తీ పెంచాలని విజ్ఞప్తి చేశారు.




