Sircilla: సిరిసిల్లలో జానపద జాతర.. 33 జిల్లాల కళాకారులతో ఫోక్ నైట్!

Sircilla: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ (టీజీఎఫ్‌ఐ) తొలి ఆవిర్భావ వేడుకలు, జానపద జాతర నవంబర్ 1న సిరిసిల్లలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు రమణాకర్ తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 6 Oct 2026 4:41 PM IST
Sircilla
X

Sircilla: సిరిసిల్లలో జానపద జాతర.. 33 జిల్లాల కళాకారులతో ఫోక్ నైట్!

సిరిసిల్ల: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ (టీజీఎఫ్‌ఐ) తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సిరిసిల్ల వేదిక కానుందని సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు పత్తిపాటి రమణాకర్ తెలిపారు. నవంబర్ 1న సిరిసిల్ల పట్టణంలో జానపద జాతర, ఫోక్ నైట్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

మంగళవారం సిరిసిల్ల పట్టణంలోని షాదీఖానాలో టీజీఎఫ్‌ఐ సభ్యులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. అంతకుముందు సంస్థ ప్రతినిధులు జూనియర్ కళాశాల మైదానంలో వేడుకల సభ కోసం ఏర్పాట్లు చేయనున్న స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో తొలి ఆవిర్భావ దినోత్సవ వేడుకల వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పత్తిపాటి రమణాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని 33 జిల్లాల నుంచి జానపద కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సిరిసిల్ల జానపద కళాకారుల పురిటిగడ్డ అని, తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో కళాకారులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో సినీ పరిశ్రమకు దీటుగా ఫోక్ ఇండస్ట్రీ ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

జానపద కళాకారుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. సినీ పరిశ్రమకు కల్పిస్తున్న తరహాలో జానపద కళాకారులకు కూడా ప్రభుత్వ రాయితీలు, ప్రోత్సాహకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. కళాకారుల సంక్షేమంతో పాటు జానపద కళను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

నవంబర్ 1న నిర్వహించే కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో జానపద కళాకారులు హాజరుకానున్నట్లు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కూడా పాల్గొనే అవకాశం ఉందన్నారు. బతుకమ్మ, దసరా వేడుకల అనంతరం సిరిసిల్లలో జానపద పండుగను నిర్వహిస్తున్నామని, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో జానపద కళాకారులు సభ్యత్వం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో టీజీఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జీఎల్ నాందేవ్, ప్రధాన కార్యదర్శి ఎండీ సత్తార్, ప్రచార కార్యదర్శి ఆకునూరు దేవయ్య, కోశాధికారి గజ్వేల్ వేణు, రేలారే గంగా, సలహాదారు అంజన్న దరువు అంజన్న, శిరీష, నక్క శ్రీకాంత్, నాగలక్ష్మి, తెలు విజయ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA