Manthani: తునికాకు కూలీలకు శఠగోపం: ఖాతాల్లో వేలల్లో కోత

Manthani: మంథని మండలం గోపాల్‌పూర్‌లో 177 మంది తునికాకు కూలీల ఖాతాల్లో రూ.2-3 వేల వరకు కోత విధించారు. కార్డులు లాక్కున్నారని ఎఫ్‌ఆర్‌ఓకు కూలీలు ఫిర్యాదు చేశారు.

SHANKAR, MANTHANI
Published on: 2 Nov 2026 4:57 PM IST
Manthani
X

Manthani: తునికాకు కూలీలకు శఠగోపం: ఖాతాల్లో వేలల్లో కోత

పెద్దపల్లి జిల్లా: మంథని మండలం గోపాల్ పూర్ గ్రామంలో తునికాకు సేకరణ కూలీలు తీవ్రంగా నష్టపోయారు. 2026 మే నెలలో జరిగిన తునికాకు సేకరణలో కూలీలకు రావాల్సిన పూర్తి డబ్బులు రాకపోవడంతో గ్రామంలో ఆందోళన నెలకొంది. మంథని మండలం గోపాల్ పూర్ గ్రామానికి చెందిన దాదాపు 177 మంది గిరిజన, పేద కూలీలు మే నెలలో ఎండను లెక్క చేయకుండా అడవిలో తునికాకు సేకరించారు.

వారు కోసిన కట్టల లెక్క ప్రకారం ఒక్కొక్కరికి రూ. 8 వేల నుండి రూ. 10 వేల వరకు రావాలి. కానీ వారి బ్యాంక్ అకౌంట్లలో మాత్రం కేవలం రూ. 5 వేలు, రూ. 6 వేలు మాత్రమే జమ అయ్యాయి. ఒక్కొక్కరికి రూ. 2,000 నుండి రూ. 3,000 వరకు తక్కువ పడింది. దీనిపై కూలీలు సంబంధిత కల్లేదారును, ఆఫీసులో అడిగితే "ఆఫీసులో తప్పుగా కొట్టారు, సరి చేస్తాం" అంటూ దాటవేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సరిచేయలేదు.

కార్డులు కూడా లాక్కున్నారని ఆరోపణ:

ఇదే కాకుండా మా వద్ద ఎలాంటి ఆధారం లేకుండా కల్లేదారు మా తునికాకు కార్డులన్నీ తీసుకుని వెళ్లిపోయాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కార్డులు చేతిలో లేకపోవడంతో మేము ఎంత సేకరించామో చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము చేసిన కట్టలకు పూర్తి డబ్బులు మా అకౌంట్లో పడేలా చూడాలి. మా కార్డులు మాకు ఇప్పించాలి" అంటూ గోపాల్ పూర్ గ్రామ ప్రజలు మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గారికి వినతి పత్రం అందజేశారు.

గ్రామస్తుల డిమాండ్:

177 మంది కూలీల అకౌంట్లను వెంటనే సరిచేసి, తక్కువ పడిన రూ.2-3 వేలు తిరిగి జమ చేయాలి. కల్లేదారు తీసుకెళ్లిన తునికాకు కార్డులను తిరిగి కూలీలకు అప్పగించాలి. ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. ఎండనక, వాననక కష్టపడి అడవి బిడ్డలు సేకరించిన తునికాకు డబ్బుల్లో కోత పడటం అన్యాయమని, అటవీ శాఖ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

SHANKAR, MANTHANI

SHANKAR, MANTHANI