Sircilla: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి: సీఈవో!

Sircilla: ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని, ఏఎస్‌డీ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్లతో నిర్వహించిన వీసీలో సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 9:40 PM IST
Sircilla
X

Sircilla: ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలి: సీఈవో!

రాజన్న సిరిసిల్ల జిల్లా: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌-2026) ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనల ప్రకారం పారదర్శకంగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. ఏఎస్‌డీ (ఆబ్సెంట్, షిఫ్టెడ్, డెత్) జాబితా, డిలీషన్ జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియ పురోగతి, పెండింగ్‌లో ఉన్న అంశాలు, తుది ఓటర్ల జాబితా ప్రచురణకు చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏఎస్‌డీ జాబితాలోని ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. గైర్హాజరు, చిరునామా మార్పు, మరణించిన ఓటర్లు, డూప్లికేట్ ఓటర్ల వివరాలను సంబంధిత ఆధారాలతో ధ్రువీకరించాలని సూచించారు. సరైన విచారణ లేకుండా ఏ ఒక్క అర్హుడైన ఓటరు పేరు తొలగించకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

డిలీషన్ జాబితాలో ఉన్న ప్రతి ఓటరు వివరాలను నిబంధనల ప్రకారం పరిశీలించాలని, పేరు తొలగించడానికి గల కారణాలు, ఆధారాలను తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలు, వివరణలు, సమర్పించిన పత్రాలను పరిగణనలోకి తీసుకొని ఎన్నికల సంఘం నిబంధనల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

ఫారం-6 ద్వారా కొత్త ఓటరు నమోదుకు వచ్చిన దరఖాస్తులు, ఫారం-7 ద్వారా వచ్చిన అభ్యంతరాలు, ఓటరు పేరు తొలగింపునకు సంబంధించిన అభ్యర్థనలు, ఫారం-8 ద్వారా వచ్చిన చిరునామా మార్పులు, ఓటరు వివరాల సవరణ దరఖాస్తుల పరిష్కార స్థితిని నిరంతరం సమీక్షించాలని ఆదేశించారు. నిర్ణీత గడువులోగా విచారణలు పూర్తి చేసి దరఖాస్తులను పరిష్కరించాలని తెలిపారు.

ఓటర్ల జాబితాలో పేరు చేర్పులు, తొలగింపులు, మార్పులకు సంబంధించి అధికారులు తీసుకునే ప్రతి నిర్ణయానికి స్పష్టమైన కారణాలు తెలియజేస్తూ స్పీకింగ్ ఆర్డర్లు జారీ చేయాలని సూచించారు. ప్రతి కేసుకు సంబంధించిన నోటీసులు, విచారణ నివేదికలు, ఓటర్లు సమర్పించిన ఆధారాలు, ఇతర సంబంధిత పత్రాలను క్రమపద్ధతిలో భద్రపరచాలని తెలిపారు. భవిష్యత్తులో అభ్యంతరాలు వచ్చినప్పుడు అవసరమైన రికార్డులు అందుబాటులో ఉండేలా పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

జిల్లాల వారీగా ఏఎస్‌డీ జాబితా, డిలీషన్ జాబితా, ఫారం-6, 7, 8 దరఖాస్తుల పరిష్కార పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సూచించారు. తుది ఓటర్ల జాబితా ప్రచురణకు ముందు అన్ని వివరాలను మరోసారి పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

భారత ఎన్నికల సంఘం ఎస్‌ఐఆర్‌-2026 ప్రక్రియకు సంబంధించి సవరించిన షెడ్యూల్‌ను ప్రకటించిన నేపథ్యంలో, నవంబర్ 26, 2026లోగా నోటీసుల జారీ, విచారణలు, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. నవంబర్ 30, 2026న తుది ఓటర్ల జాబితా ప్రచురించాల్సి ఉన్నందున, నిర్ణీత గడువులను దృష్టిలో ఉంచుకొని అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA