Peddapalli: ఏషియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఆర్చర్ తానిపర్తి చికిత!
Peddapalli: పెద్దపల్లి జిల్లా సుల్తాన్‌పూర్‌కు చెందిన యువ ఆర్చర్ తానిపర్తి చికిత 2026 ఏషియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణ పతకాలు సాధించి ఒలింపిక్స్‌కు అర్హత.
Peddapalli: ఏషియన్ గేమ్స్‌లో రెండు స్వర్ణాలు సాధించిన ఆర్చర్ తానిపర్తి చికిత!
Peddapalli: పేదరికం ప్రతిభకు అడ్డుకాదని నిరూపించింది ఓ తెలంగాణ బిడ్డ. సాధారణ కుటుంబంలో పుట్టి.. అసాధారణ ప్రతిభతో అంతర్జాతీయ క్రీడా వేదికపై భారత జెండాను రెపరెపలాడించింది. విల్లంబులను తన జీవిత లక్ష్యంగా మార్చుకుని.. గురి తప్పని బాణాలతో విజయాలను సొంతం చేసుకుంటున్న యువ ఆర్చర్ తానిపర్తి చికిత.
పూర్వపు కరీంనగర్ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్‌పూర్ గ్రామానికి చెందిన తానిపర్తి శ్రీనివాసరావు-శ్రీలత దంపతులకు 2005లో చికిత జన్మించింది. చిన్నప్పటి నుంచే ఆమెకు ఆటలంటే ఎంతో ఆసక్తి. తన కుమార్తెలో ఉన్న ప్రతిభను తండ్రి శ్రీనివాసరావు గుర్తించారు. దీంతో 2019లో చికితను ఆర్చరీలో చేర్పించారు. అప్పటి నుంచి ఆమె వెనుదిరిగి చూడలేదు.
ఆర్చరీలో శిక్షణ ప్రారంభించిన నాటి నుంచి కఠోర సాధన చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ప్రపంచ యూత్ ఛాంపియన్‌షిప్ నుంచి ఆసియా స్థాయి పోటీల వరకు తన ప్రతిభను చాటుకుంది. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రీడల్లో ఏడు పతకాలు సాధించిన చికిత.. తాజాగా 2026 ఏషియన్ గేమ్స్‌లో మరో రెండు స్వర్ణ పతకాలను తన ఖాతాలో వేసుకుని మొత్తం పతకాల సంఖ్యను తొమ్మిదికి చేర్చుకునీ 2028 ఒలంపిక్స్ లో అర్హత సాధించింది..
చికిత విజయాల వెనుక ఆమె ప్రతిభతో పాటు కుటుంబం చేసిన త్యాగం కూడా ఉంది. కూతురి కలను నిజం చేయాలనే లక్ష్యంతో తండ్రి తన సొంత వ్యవసాయ యంత్రాన్ని సైతం విక్రయించారు. శిక్షణ, ప్రయాణాలు, పోటీల ఖర్చుల కోసం కుటుంబం అప్పులు చేసి మరీ ఆమెకు అండగా నిలిచింది. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. చికిత సాధనకు మాత్రం అవి అడ్డుకాలేదు.
తండ్రి నమ్మకాన్ని, కుటుంబం చేసిన త్యాగాలను వమ్ము చేయకుండా చికిత తన విల్లుతోనే సమాధానం ఇచ్చింది. లక్ష్యాన్ని గురిపెట్టి.. ప్రతి బాణాన్ని విజయానికి మెట్టుగా మార్చుకుంది. సుల్తాన్‌పూర్ అనే చిన్న పల్లె నుంచి ఆసియా క్రీడల వేదిక వరకు ఆమె సాగించిన ప్రయాణం నిజంగా స్ఫూర్తిదాయకం.
రెండు స్వర్ణ పతకాలతో భారత జెండాను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించిన చికిత.. తన గ్రామానికి, పెద్దపల్లి జిల్లాకు, తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆర్చరీలో తెలంగాణ నుంచి వెలుగులోకి వచ్చిన ఈ యువ ప్రతిభ.. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
పల్లె మట్టిలో పుట్టిన ప్రతిభ.. ప్రపంచ వేదికపై మెరిసిన స్వర్ణం.. కుటుంబం చేసిన త్యాగాలకు దక్కిన గౌరవం.. ఇదే తానిపర్తి చికిత విజయగాథ. ఆమె ప్రయాణం క్రీడల్లో రాణించాలనుకునే ప్రతి యువతికి ఒక స్ఫూర్తి సందేశం.




