Sullurupeta: పోలింగ్ తేదీ నామినేషన్ల వివరాలు వెల్లడించిన సీఐ మురళీకృష్ణ
Sullurupeta: సూళ్ళూరుపేట మున్సిపల్ ఎన్నికల కోడ్ అమలులో ఉంది. అక్టోబర్ 16-18 నామినేషన్లు, 28న పోలింగ్, 30న కౌంటింగ్. పట్టణంలో పటిష్ట పోలీసు భద్రతా ఆంక్షలు అమలు.
Sullurupeta: పోలింగ్ తేదీ నామినేషన్ల వివరాలు వెల్లడించిన సీఐ మురళీకృష్ణ
Sullurupeta: మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వెలువడి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, అల్లర్లు జరగకుండా పోలీసులు ముందస్తు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్.సుబ్బారాయుడు ఆదేశాల మేరకు, నాయుడుపేట డీఎస్పీ జి.చెంచుబాబు పర్యవేక్షణలో సూళ్ళూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.మురళీకృష్ణ స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఐ ఎం.మురళీకృష్ట ఎన్నికల షెడ్యూల్ వివరాలను వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని, 19న నామినేషన్ల పరిశీలన (స్క్రూటినీ) జరుగుతుందని తెలిపారు. అలాగే 21న నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుందని, ఈ నెల 28న పోలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత 30వ తేదీన ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) మరియు ఫలితాల వెల్లడి ఉంటుందని, ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు కోడ్ కఠినంగా అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు.
స్థానిక మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డులు, 24 పోలింగ్ లొకేషన్లు మరియు 55 పోలింగ్ స్టేషన్లలో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఆరు ప్రధాన కేంద్రాలతో పాటు వార్డ్ కౌన్సిలర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి, ఎలాంటి అశాంతి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎన్నికల విధుల సజావు నిర్వహణకు ఐదుగురు సబ్ ఇన్స్పెక్టర్లకు (ఎస్సైలకు) ప్రత్యేక బాధ్యతలు అప్పగించి నిరంతర గస్తీ, నిఘా ఏర్పాటు చేశామన్నారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎక్కడ పడితే అక్కడ మద్యం తాగి రోడ్లపైకి వచ్చినా, మద్యం మత్తులో ప్రజలను లేదా కౌన్సిలర్ అభ్యర్థులను బెదిరింపులకు గురిచేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రౌడీషీటర్లు, గతంలో బైండోవర్ అయిన వ్యక్తులు ఎలాంటి గొడవలకు దిగినా వారిపై అత్యంత బలమైన కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ సమయంలో గొడవల్లో తలదూర్చి కేసులు కొనితెచ్చుకుంటే జీవితాలు, భవిష్యత్తు నాశనమవుతాయని యువతకు హితవు పలికారు. మన ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, ఆ ఉపాధి అవకాశాలను ఉపయోగించుకుని సక్రమంగా జీవించాలని సూచించారు. సరైన ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి నగదు తరలించడం, ఓటర్లను ప్రలోభపెట్టడం నేరమని, ప్రజాస్వామ్య బద్ధంగా ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా రక్షణ కల్పిస్తామని సీఐ ఎం.మురళీకృష్ట స్పష్టం చేశారు.




