Sircilla: ఎల్‌సీడీసీ కుష్టు వ్యాధి సర్వేను పరిశీలించిన రాష్ట్ర అధికారులు!
Sircilla: తంగళ్లపల్లి పీహెచ్‌సీ పరిధిలో జరుగుతున్న ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు (LCDC) సర్వేను రాష్ట్ర పరిశీలకులు డాక్టర్ లత క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Sircilla: ఎల్‌సీడీసీ కుష్టు వ్యాధి సర్వేను పరిశీలించిన రాష్ట్ర అధికారులు!
Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహిస్తున్న ఎల్‌సీడీసీ (లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్) సర్వేను రాష్ట్ర పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. రాష్ట్ర మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ లత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. రామ్ రెడ్డితో కలిసి తంగళ్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్వే నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందితో మాట్లాడి, ఇంటింటి సర్వే విధానం, అనుమానిత కుష్టు వ్యాధి లక్షణాలను గుర్తించే ప్రక్రియను పరిశీలించారు. సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రతి ఇంటిని సందర్శించి, ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా పరీక్షించాలని సూచించారు. అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించాలని, వ్యాధి నిర్ధారణ అయిన వారికి తగిన చికిత్స అందించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌సీడీసీ సర్వే పూర్తి కావడానికి ఇంకా మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు నిర్దేశిత గడువులోగా సర్వేను పూర్తి చేయాలని సూచించారు. కుష్టు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స అందించడం ద్వారా అంగవైకల్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
ప్రజలు ఆరోగ్య సిబ్బందికి సహకరించి సర్వేకు అవసరమైన పూర్తి వివరాలను అందించాలని కోరారు. సర్వేను నాణ్యతతో, నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేయాలని సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర మానిటరింగ్ ఆఫీసర్ డాక్టర్ లత, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పి. రామ్ రెడ్డి, డీపీఎంఓ ఇ. దేవ్ సింగ్, వైద్య సిబ్బంది, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




