Manthani: నన్ను నమ్ముకున్న వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యం!
Manthani: మంథనిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభం, సంగీత పాఠశాల ఆవిష్కరణ చేసిన మంత్రి శ్రీధర్ బాబు. పెన్షన్లు, చెక్కుల పంపిణీ, 63 అంగన్వాడీలకు రూ.7.46 కోట్లు మంజూరు.
Manthani: నన్ను నమ్ముకున్న వారి ముఖాల్లో చిరునవ్వు చూడటమే లక్ష్యం!
Manthani: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంథని పట్టణంలో నూతనంగా నిర్మించిన మూడు ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు హాజరై లబ్ధిదారులతో కలిసి ఇళ్లను ప్రారంభించారు. అనంతరం రూ.15 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ సంగీత, నృత్య పాఠశాలను ప్రారంభించారు.
అనంతరం మంథని మున్సిపాలిటీ పరిధిలోని గంగాపురి ఆర్ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సంక్షేమ పథకాల లబ్ధిదారుల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్, పాలకుర్తి ఐదు మండలాలకు చెందిన 2,464 మంది లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన చేయూత పెన్షన్ పత్రాలను అందజేశారు.
అదేవిధంగా 200 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు, 117 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తనను నమ్ముకున్న ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తన లక్ష్యమని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఐదు మండలాల పరిధిలో శిథిలావస్థలో ఉన్న 63 అంగన్వాడీ కేంద్రాలను గుర్తించామని, వాటి స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి రూ.7.46 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.
మంథని ప్రాంతానికి సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన విద్యా వ్యవస్థను తీసుకువస్తున్నామని మంత్రి తెలిపారు. తన పిల్లలకు ఎలాంటి నాణ్యమైన విద్య అందాలని కోరుకున్నానో, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని ప్రతి ఒక్క పిల్లవాడికి అలాంటి విద్య అందాలన్నదే తన ఆకాంక్ష అని పేర్కొన్నారు.
ఇందులో భాగంగానే తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌ను తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ మంథని నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.




