Sircilla: భూముల రీ సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి విడత ఎంపిక చేసిన 70 గ్రామాల్లో ఈ నెల 30లోగా భూముల రీ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు.

KALEEM, SIRICILLA
Published on: 12 Nov 2026 9:05 PM IST
Sircilla
X

Sircilla: భూముల రీ సర్వేలో వేగం పెంచాలి: కలెక్టర్ గరిమ అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, వ్యవసాయ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి సర్వే ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని సూచించారు.

జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి భూముల రీ సర్వేపై సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వేలో భాగంగా మొదటి విడతలో ఎంపిక చేసిన 70 గ్రామాల్లో సర్వే ప్రక్రియను ఈ నెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. సర్వే కోసం అవసరమైన రోవర్ యంత్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

ఏయే గ్రామాల్లో, ఏయే సర్వే నంబర్లలో, ఏ తేదీల్లో సర్వే నిర్వహించనున్నారనే వివరాలను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు ముందుగానే వ్యవసాయ శాఖ అధికారులకు అందించాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు, జీపీఓలు, పంచాయతీ కార్యదర్శులు రైతులు, పట్టాదారులకు సర్వే వివరాలను ముందస్తుగా తెలియజేయాలని స్పష్టం చేశారు.

రైతుల సమక్షంలోనే భూముల రీ సర్వే నిర్వహించాలని, ప్రక్రియ పూర్తయిన అనంతరం వారి సంతకాలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్లు తమ మండలాల్లో జరుగుతున్న సర్వేను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే కొనసాగించాలని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు 60 నుంచి 100 ఎకరాల వరకు సర్వే పూర్తి చేయాలని తెలిపారు. ప్రతిరోజు సర్వే అనంతరం సంబంధిత రికార్డుల పనులను కూడా పూర్తి చేయాలని ఆదేశించారు.

అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నిర్ణీత గడువులోగా సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను తహసీల్దార్లు గుర్తించి పరిష్కరించాలని సూచించారు. భూముల రీ సర్వేపై రైతులు అవగాహన పెంచుకుని అధికారులకు సహకరించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ కోరారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్ బేగం తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA