Sircilla: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో సైబర్ ఆర్థిక నేరాల నివారణపై నవంబర్ నెలంతా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

KALEEM, SIRICILLA
Published on: 5 Nov 2026 12:09 PM IST
Sircilla
X

Sircilla: సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి.. ఎస్పీ మహేష్ బి. గితే!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సైబర్ ఆర్థిక నేరాల నివారణ, సురక్షిత డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. నవంబర్ నెల మొత్తం “YOUR MONEY, YOUR CLICK, YOUR CHOICE” ప్రధాన ఇతివృత్తంతో పాటు “Pause the Payment – Verify the Person” నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో సైబర్ నేరాల నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను ఎస్పీ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతుల్లో ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేస్తున్నారని, ఆన్‌లైన్ లావాదేవీల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లించే ముందు క్షణం ఆగి, నగదు స్వీకరించే వ్యక్తి లేదా సంస్థ వివరాలను పూర్తిగా ధృవీకరించుకోవాలని తెలిపారు. ఆన్‌లైన్ ప్రకటనల ద్వారా వస్తువులు, సేవలు అందిస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేయడం, వ్యక్తిగత వివరాలను దొంగిలించి క్రెడిట్, డెబిట్ కార్డులను దుర్వినియోగం చేయడం, స్టాక్ మార్కెట్‌లో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపుతూ నకిలీ పెట్టుబడి పథకాలతో మోసాలకు పాల్పడటం వంటి ఘటనల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.

అలాగే గూగుల్, సోషల్ మీడియాలో కనిపించే ప్రతి కస్టమర్ కేర్ నంబర్ నిజమైనదని నమ్మి సంప్రదించవద్దని, అపరిచితుల సూచనల మేరకు స్క్రీన్ షేరింగ్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేయవద్దని హెచ్చరించారు. ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించకూడదని, అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచించారు. ప్రతి ఆన్‌లైన్ చెల్లింపునకు ముందు లబ్ధిదారుడి పేరు, ఖాతా వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని స్పష్టం చేశారు.

ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫోన్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు. మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేయడం ద్వారా మోసపోయిన నగదును నిలువరించే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు.

ప్రజలందరూ సైబర్ భద్రతా నియమాలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని, సురక్షితమైన డిజిటల్ లావాదేవీలను అలవాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో సైబర్ ఆర్‌ఎస్‌ఐ జునైద్‌తో పాటు సైబర్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA