Sircilla: ముస్తాబాద్ రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. వ్యాన్ సీజ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకయ్యకుంట-బాధనకల్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని ఎస్పీ మహేష్ బి. గితే పరిశీలించారు.

KALEEM, SIRICILLA
Published on: 24 Nov 2026 12:54 PM IST
Sircilla
X

Sircilla: ముస్తాబాద్ రోడ్డు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ.. వ్యాన్ సీజ్!

Sircilla: రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకయ్యకుంట–బాధనకల్ గ్రామాల శివారులో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాద స్థలాన్ని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే మంగళవారం పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును, రహదారి పరిస్థితులను, ప్రమాదానికి దారితీసిన కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ప్రమాదానికి కారణమైన వ్యాన్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, వ్యాన్‌ను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను అన్ని కోణాల్లో విచారించి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని డీఎస్పీ, సీఐ, ఎస్ఐలను ఎస్పీ ఆదేశించారు. విచారణను వేగవంతం చేసి పూర్తి నివేదిక సమర్పించాలని సూచించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అధిక వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తూ అప్రమత్తంగా ప్రయాణించాలని సూచించారు. ముఖ్యంగా పొగమంచు కారణంగా రహదారులపై దృశ్యమానత తగ్గే అవకాశం ఉన్నందున వాహన వేగాన్ని తగ్గించాలని, ముందు వెళ్తున్న వాహనాలకు తగినంత సురక్షిత దూరం పాటించాలని కోరారు.

ఈ పరిశీలనలో డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ నాగేశ్వరరావు, ఎస్ఐ జ్యోతి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA