Siricilla: కుటుంబ వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం

Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో పవర్‌లూమ్ కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. కుటుంబ వివాదాలు, కౌన్సెలింగ్ ఆవశ్యకతపై సైకాలజిస్ట్ అవగాహన కల్పించారు.

KALEEM, SIRICILLA
Published on: 13 Nov 2026 3:02 PM IST
Siricilla
X

Siricilla: కుటుంబ వివాదాల పరిష్కారానికి ఫ్యామిలీ కౌన్సెలింగ్ అవసరం

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్ నగర్‌లో పవర్‌లూమ్ కార్మికులకు మనోవికాస సదస్సు నిర్వహించారు. మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్, ప్రభుత్వ సాధారణ వైద్యశాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నంచందర్ పాల్గొని కుటుంబ సంబంధాలు, కుటుంబ వివాదాల పరిష్కారం, ఫ్యామిలీ కౌన్సెలింగ్ ఆవశ్యకతపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు, ఆర్థిక సమస్యలు, పిల్లల పెంపకం, పరస్పర అనుమానాలు, మద్యపానం, పని ఒత్తిడి వంటి అంశాలు కుటుంబ వివాదాలకు కారణమవుతున్నాయని తెలిపారు. చిన్న చిన్న సమస్యలను నిర్లక్ష్యం చేస్తే అవి పెద్ద వివాదాలుగా మారి కుటుంబ ప్రశాంతతను దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన, సహనం, గౌరవం, ఓపికతో కూడిన సంభాషణ అవసరమని సూచించారు. సమస్యలు తలెత్తినప్పుడు ఒకరినొకరు నిందించుకోకుండా, అహానికి తావివ్వకుండా చర్చించుకోవడం ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనవచ్చని వివరించారు.

కుటుంబ సమస్యలు తీవ్రమైనప్పుడు ఫ్యామిలీ కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా భార్యాభర్తల మధ్య అపోహలను తొలగించుకోవడంతో పాటు భావోద్వేగ సమస్యలను అర్థం చేసుకుని సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. కౌన్సెలింగ్ కుటుంబ బంధాలను బలోపేతం చేయడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.

పవర్‌లూమ్ కార్మికులు వృత్తిపరమైన ఒత్తిడి కుటుంబ జీవితంపై ప్రభావం చూపకుండా చూసుకోవాలని, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అవసరమైన వారు మైండ్ కేర్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది రాపెల్లి లత, బూర శ్రీమతి, కొండ ఉమతో పాటు పలువురు కార్మికులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA