Siricilla: సిరిసిల్లలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు!
Siricilla: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.. ఘన నివాళులు అర్పించిన మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి.
Siricilla: సిరిసిల్లలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు!
Siricilla: సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి జిందం కళా చక్రపాణి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పద్మశాలి సంఘాల నాయకులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ వారిపై, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లపై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని పేర్కొన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు విలువైన సూచనలు, సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారని తెలిపారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడంతో పాటు పద్మశాలీల సమస్యలపై పోరాడి, పద్మశాలి కుల బాంధవుల ఐక్యత కోసం విశేష కృషి చేశారని కొనియాడారు.
కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలను గౌరవిస్తూ ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించామని, ఆయన ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చైర్‌పర్సన్ అన్నారు. ఈ నెల 27వ తేదీన నిర్వహించనున్న ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘం అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.




