Siricilla: బాలల హక్కుల పరిరక్షణపై అందరూ అవగాహన కలిగి ఉండాలి

Siricilla: సిరిసిల్లలో బాలల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో సీనియర్ సివిల్ జడ్జి పి. లక్ష్మణాచారి బాలల హక్కులపై సూచనలు చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 14 Nov 2026 10:03 PM IST
Siricilla
X

Siricilla: బాలల హక్కుల పరిరక్షణపై అందరూ అవగాహన కలిగి ఉండాలి

సిరిసిల్ల: బాలల హక్కుల పరిరక్షణ, వారి సంక్షేమం, భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి. లక్ష్మణాచారి అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా శనివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలలో విద్యార్థులకు న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి. నీరజ సూచనల మేరకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) రూపొందించిన Child Friendly Legal Services for Children Scheme, 2024 ప్రకారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా లక్ష్మణాచారి మాట్లాడుతూ.. ప్రతి బాలుడికి విద్య, ఆరోగ్యం, రక్షణ, గౌరవప్రదమైన జీవనం పొందే హక్కులు ఉన్నాయని తెలిపారు. బాలలపై జరిగే లైంగిక వేధింపులు, బాల కార్మికత్వం, బాల్యవివాహాల వంటి సమస్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాలల హక్కులకు భంగం కలిగితే భయపడకుండా సంబంధిత అధికారులను లేదా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని విద్యార్థులకు వివరించారు. అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందించేందుకు న్యాయ సేవాధికార సంస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

ప్రతి విద్యార్థి తన హక్కులతో పాటు ఇతరుల హక్కులను కూడా గౌరవించాలని, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఆత్మవిశ్వాసంతో విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. బాలల భద్రత, హక్కుల పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ యాస్మిన్, సిరిసిల్ల ఎస్‌ఐ అనిల్ కుమార్, లోక్ అదాలత్ సభ్యులు, న్యాయవాదులు ఆడెపు వేణు, గుర్రం ఆంజనేయులు, అనూష, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA