Yellareddypet: బండలింగంపల్లి ఉపసర్పంచ్‌పై హత్యాయత్నం.. రిమాండ్
Yellareddypet: రాజన్న సిరిసిల్ల జిల్లా బండలింగంపల్లి ఉపసర్పంచ్ బొడ్డు రాజుపై కత్తితో దాడి చేసిన నిందితుడు అజ్మీర శ్రీనును ఎల్లారెడ్డిపేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Yellareddypet: బండలింగంపల్లి ఉపసర్పంచ్‌పై హత్యాయత్నం.. రిమాండ్
ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొడ్డు రాజుపై కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఓ. వెంకటేష్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. బండలింగంపల్లి గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బొడ్డు రాజు (30) టెంట్ హౌస్ నిర్వహణతో పాటు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నవంబర్ 1వ తేదీన గ్రామంలో జరిగిన హల్దీ ఫంక్షన్‌కు టెంట్ వేసి తిరిగి వస్తుండగా, టాటా ఏస్ ఆటోలో డీజిల్ అయిపోవడంతో రాజు, అతనితో పాటు పనిచేసే బొడ్డు నరేష్, జక్కుల మహేష్ కలిసి రాత్రి 11:30 గంటల సమయంలో కాసరవేణి ఎల్లం ఇంటి వద్దకు డీజిల్ కోసం వెళ్లారు.
అక్కడ ఉన్న అజ్మీర శ్రీను (25) నరేష్, మహేష్‌లతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో గొడవను ఆపేందుకు బొడ్డు రాజు మధ్యలోకి వెళ్లగా, అజ్మీర శ్రీను ఇంట్లో నుంచి కూరగాయలు కోసే కత్తిని తీసుకొచ్చి చంపుతానంటూ రాజు కడుపు కుడివైపు పొడిచాడు. దీంతో తీవ్రంగా గాయపడిన రాజును స్థానికులు చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేటలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు.
దాడికి పాల్పడిన అజ్మీర శ్రీను మెదక్ జిల్లా శంకరంపేట మండలం మీర్జాపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. పెయింటింగ్ పని నిమిత్తం బండలింగంపల్లిలోని గరీపెల్లి సంతోష్ ఇంటికి వచ్చినట్లు తెలిపారు.
బాధితుడి తండ్రి బొడ్డు బాలనర్సు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపేట ఎస్సై ఎన్. రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు అజ్మీర శ్రీనును అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఓ. వెంకటేష్ తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రజలు చిన్నచిన్న విషయాలకు ఆవేశానికి లోనై గొడవలు, దాడులకు పాల్పడవద్దని సూచించారు. ఎవరైనా చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలు తలెత్తినప్పుడు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు.




