Sircilla: మగ్గంపై దుబాయ్ రాజకుటుంబం చిత్రాలు..అరుదైన శాలువా రూపకల్పన!

Sircilla: దుబాయ్ రాజకుటుంబ సభ్యుల చిత్రాలతో ప్రత్యేక శాలువా రూపొందించిన సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరి ప్రసాద్. బతుకమ్మ వేడుకల్లో బహుమతిగా అందజేత.

KALEEM, SIRICILLA
Published on: 7 Oct 2026 12:03 PM IST
Sircilla
X

Sircilla: మగ్గంపై దుబాయ్ రాజకుటుంబం చిత్రాలు..అరుదైన శాలువా రూపకల్పన!

Sircilla: తెలంగాణ చేనేత కళకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గుర్తింపు లభించనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన నేత కార్మికుడు వెళ్ది హరి ప్రసాద్ సంప్రదాయ మగ్గంపై దుబాయ్ రాజకుటుంబ సభ్యుల చిత్రాలతో ప్రత్యేక శాలువాను రూపొందించారు. దుబాయ్‌లో ఈ నెల 11న జరగనున్న బతుకమ్మ వేడుకల్లో ఈ కళాఖండాన్ని ప్రదర్శించి, అనంతరం రాజకుటుంబానికి ప్రత్యేక కానుకగా అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

15 రోజుల శ్రమతో ప్రత్యేక కళాఖండం

దుబాయ్ పాలక కుటుంబంపై ఉన్న గౌరవం, అభిమానంతో హరి ప్రసాద్ సుమారు 15 రోజుల పాటు శ్రమించి ఈ శాలువాను రూపొందించారు. సాధారణంగా చీరలు, శాలువాలు, వివిధ రకాల డిజైన్లను రూపొందించే సిరిసిల్ల మగ్గంపై రాజకుటుంబ సభ్యుల ముఖచిత్రాలను నూలుపోగులతో నేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

ముగ్గురు రాజకుటుంబ ప్రముఖుల చిత్రాలు

ప్రత్యేకంగా రూపొందించిన ఈ శాలువాపై దుబాయ్ పాలకుడు హిస్ హైనెస్ షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, దుబాయ్ యువరాజు హెచ్.హెచ్. షేక్ హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్, హెచ్.హెచ్. షేక్ మక్తూమ్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ చిత్రాలను నూలుపోగులతో ఆవిష్కరించారు. ముఖ కవళికలు సైతం స్పష్టంగా కనిపించేలా రూపొందించిన ఈ శాలువా సిరిసిల్ల నేత కళాకారుల నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.

దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో ప్రదర్శన

దుబాయ్‌లో ఈ నెల 11న జరగనున్న ETCA బతుకమ్మ వేడుకల్లో ఈ ప్రత్యేక శాలువాను ప్రదర్శించనున్నారు. అనంతరం దుబాయ్ రాజకుటుంబానికి ఈ కళాఖండాన్ని ప్రత్యేక కానుకగా అందించేందుకు ETCA ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ నుంచి దుబాయ్‌కు వెళ్లి అక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికులకు అవకాశాలు కల్పిస్తున్న దుబాయ్ పాలక కుటుంబంపై గౌరవానికి ప్రతీకగా ఈ కానుకను రూపొందించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సిరిసిల్ల నుంచి దుబాయ్ వరకు..

ఈ అరుదైన కళాఖండాన్ని దుబాయ్ బతుకమ్మ వేడుకలకు తీసుకెళ్లేందుకు ETCA ప్రతినిధి పిచర కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో రాజకుటుంబానికి ఈ కానుకను అందించే కార్యక్రమం జరగనుంది.

అంతర్జాతీయ వేదికపై తెలంగాణ నేత కళ

దుబాయ్‌లో జరగనున్న బతుకమ్మ వేడుకలకు తెలంగాణకు చెందిన ప్రముఖ నాయకులు, సామాజికవేత్తలు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల నేత కార్మికుడు రూపొందించిన ప్రత్యేక శాలువాను ప్రదర్శించనుండటంతో తెలంగాణ చేనేత కళకు అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు లభించే అవకాశం ఉంది.

మగ్గంపై నేసిన నూలుపోగులు.. దుబాయ్ రాజకుటుంబంపై అభిమానానికి ప్రతిరూపంగా మారాయి. సిరిసిల్ల నుంచి దుబాయ్ వరకు చేరుతున్న ఈ ప్రత్యేక కళాఖండం.. తెలంగాణ నేత కళా వైభవానికి మరో చిరునామాగా నిలవనుంది.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA