Sircilla: బ్యాంకు రుణాలను వ్యాపారాభివృద్ధికి వినియోగించుకోవాలి

Sircilla: సిరిసిల్లలో బ్యాంకుల ద్వారా సంస్థాగత రుణాలు పొంది వ్యాపారాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.

KALEEM, SIRICILLA
Published on: 23 Oct 2026 8:48 PM IST
Sircilla
X

Sircilla: బ్యాంకు రుణాలను వ్యాపారాభివృద్ధికి వినియోగించుకోవాలి

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో చేనేత, పవర్‌లూమ్ పరిశ్రమల యజమానులు, ఆసాములు, కార్మికులు బ్యాంకుల ద్వారా సంస్థాగత రుణాలు పొంది, వాటిని వ్యాపారాభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన, ఆకర్షణీయమైన వస్త్రాలను తయారు చేసి ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శుక్రవారం సిరిసిల్ల పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ఎంఎస్‌ఎంఈ సంవాద్’ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చేనేత, పవర్‌లూమ్ రంగాలకు చెందిన యజమానులు, ఆసాములు, కార్మికులకు సంస్థాగత రుణాలపై అవగాహన కల్పించడంతో పాటు బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేలా ప్రోత్సహించారు. ఉత్పత్తులకు విలువ ఆధారిత ప్రక్రియలను జోడించడం ద్వారా ఆదాయం, ఉపాధి అవకాశాలను పెంచుకునే మార్గాలను వివరించారు.

ఈ సందర్భంగా ఆర్‌బీఐ ఎల్‌డీఓ చేతన్ మాట్లాడుతూ.. సంస్థాగత రుణాల ప్రాధాన్యత, బ్యాంకుల ద్వారా లభించే రుణ సదుపాయాలు, ఆర్థిక క్రమశిక్షణ, రుణాల సక్రమ వినియోగంపై అవగాహన కల్పించారు. అనధికారిక రుణాలపై ఆధారపడకుండా బ్యాంకులను సంప్రదించి తమ అవసరాలకు అనుగుణంగా రుణాలు పొందాలని సూచించారు.

కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు మార్కెట్ పోటీని తట్టుకునేలా ఉత్పత్తుల నాణ్యతను పెంచుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆర్డర్లకే పరిమితం కాకుండా ప్రైవేట్ ఆర్డర్లు పొందే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చేనేత వస్త్రాల తయారీపై మరింత దృష్టి సారించి సిరిసిల్ల ఖ్యాతిని చాటాలని పేర్కొన్నారు. నాణ్యమైన, ఆకర్షణీయమైన వస్త్రాల ఉత్పత్తితో మెరుగైన మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ చేతన్, నాబార్డ్ డీడీఎం దిలీప్ చంద్ర, ఎల్‌డీఎం రాజీవ్ కుమార్, పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు, హ్యాండ్‌లూమ్స్ అండ్ టెక్స్‌టైల్స్ ఏడీ సంతోష్ కుమార్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, చేనేత, పవర్‌లూమ్ యూనిట్ యజమానులు, కార్మికులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA