Thangallapalli: పోలీసుల పేరుతో డబ్బుల వసూలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్!

Thangallapalli: పోలీసుల పేరుతో బెయిల్ ఇప్పిస్తామని రూ.50 వేలు డిమాండ్ చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసిన తంగళ్లపల్లి పోలీసులు. మోసగాళ్ల మాటలు నమ్మొద్దన్న సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి.

KALEEM, SIRICILLA
Published on: 22 Sept 2026 10:08 PM IST
Thangallapalli
X

Thangallapalli: పోలీసుల పేరుతో డబ్బుల వసూలు.. ఇద్దరు నిందితుల అరెస్ట్!

తంగ్గళ్ళపల్లి: పోలీసుల పేరు చెప్పి కేసు విషయంలో డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు వ్యక్తులను తంగళ్లపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే ఉపేక్షించేది లేదని సిరిసిల్ల డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు. ఇలాంటి వ్యక్తుల సమాచారం వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.

తంగళ్లపల్లి మండలం పద్మనగర్‌కు చెందిన రాములు కుమారుడు రంగు భరత్ కుమార్, మరో వ్యక్తి రంగు తిలక్‌లు ఈ నెల 26న రాత్రి సారంపల్లి గ్రామంలో దేశాయిపల్లి గ్రామానికి చెందిన కొంతమందితో గొడవపడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఈ కేసును ఆసరాగా చేసుకుని పద్మనగర్‌కు చెందిన బెంద్రం పవన్, తంగళ్లపల్లికి చెందిన ఆసాని శ్రీకాంత్ రెడ్డి.. రాములను సంప్రదించినట్లు డిఎస్పీ తెలిపారు. కేసు విషయంలో రూ.50 వేలు ఇస్తే పోలీసులకు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇప్పిస్తామని, తన కుమారుడు జైలుకు వెళ్లకుండా చూస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. డబ్బులు ఇవ్వకపోతే జైలుకు వెళ్తాడంటూ బెదిరించి డబ్బులు డిమాండ్ చేసినట్లు రాములు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు.

ఈ క్రమంలో ఈ నెల 31న సాయంత్రం పవన్, శ్రీకాంత్ రెడ్డి మరోసారి రాములు ఇంటికి వెళ్లి బెదిరించినట్లు సమాచారం. దీంతో భయపడిన రాములు తన కుమారుడు జైలుకు వెళ్లకుండా ఉంటాడనే ఉద్దేశంతో రూ.20 వేల నగదును వారికి ఇచ్చినట్లు తెలిపారు. రంగు తిలక్ కూడా రూ.10 వేల నగదు ఇచ్చినట్లు డిఎస్పీ పేర్కొన్నారు.

అనంతరం రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తంగళ్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులు బెంద్రం పవన్, ఆసాని శ్రీకాంత్ రెడ్డిలను మంగళవారం అరెస్ట్ చేసినట్లు డిఎస్పీ నాగేంద్రచారి తెలిపారు.

పోలీసుల పేరు చెప్పి డబ్బులు డిమాండ్ చేయడం లేదా వసూలు చేయడం, కేసుల విషయంలో తప్పుడు హామీలు ఇవ్వడం చట్టరీత్యా నేరమని డిఎస్పీ తెలిపారు. ఇలాంటి వ్యక్తుల మాటలను నమ్మి మోసపోవద్దని సూచించారు. ఎవరైనా పోలీసుల పేరుతో డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112కు సమాచారం అందించాలని కోరారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA