Sircilla: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు!

Sircilla: సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు విస్తృత ఏర్పాట్లు చేశారు. కళాకారుల హక్కుల సాధనే లక్ష్యమని నేతలు స్పష్టం చేశారు.

KALEEM, SIRICILLA
Published on: 2 Nov 2026 8:05 PM IST
Sircilla
X

Sircilla: తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు!

సిరిసిల్ల: తెలుగు ఫోక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను సిరిసిల్ల పట్టణంలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు ఫోక్ ఇండస్ట్రీ ప్రధాన కార్యదర్శి మమ్మద్ సత్తర్, అధ్యక్షులు పత్తిపాటి రమణకర్ తెలిపారు.

సోమవారం సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్న వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో తొలిసారిగా వివిధ రంగాలకు చెందిన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ వేడుకలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ వేడుకలకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కవులు, కళాకారులు, టెక్నీషియన్లు, కెమెరామెన్లు, సినీ రంగంలోని 24 క్రాఫ్ట్స్‌కు చెందిన ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిపారు. సోమవారం సాయంత్రం సిరిసిల్ల పాత బస్టాండ్ నుంచి కళాకారుల భారీ ర్యాలీ ప్రారంభమై సభా వేదిక వరకు కొనసాగుతుందని వెల్లడించారు. కార్యక్రమంలో ముందుగా నమోదు చేసుకున్న కళాకారులకు వరుస క్రమంలో పాటలు పాడే అవకాశం కల్పించనున్నట్లు వివరించారు. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నట్లు తెలిపారు.

తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ప్రధాన లక్ష్యం కళాకారుల ఐక్యత, సంక్షేమం, హక్కుల సాధనేనని వారు స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలను తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కళాకారులకు కూడా వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. కళాకారుల సంక్షేమం కోసం ప్రత్యేక ఫోక్ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

సీనియర్ కళాకారులకు నెలవారీ పెన్షన్, ఆరోగ్య బీమా, నిరుపేద కళాకారులకు పక్కా ఇళ్లు, వడ్డీ లేని రుణాలు, సీనియర్ కళాకారుల పిల్లలకు ఉచిత విద్యా సదుపాయం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ కళాకారులు అనేక సంవత్సరాలుగా తమ కళారూపాల ద్వారా సమాజ శ్రేయస్సుకు విశేష సేవలు అందిస్తున్నారని తెలిపారు. వార్డు మెంబర్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రజల్లో చైతన్యం కలిగించే పాటలు పాడుతూ ప్రభుత్వాల విజయాల్లో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. అయితే ప్రభుత్వాలు మారుతున్నప్పటికీ కళాకారుల సంక్షేమం, వారి కుటుంబాల భద్రతపై తగిన శ్రద్ధ చూపకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తెలుగు ఫోక్ అసోసియేషన్, తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఆవిర్భావ వేడుకలకు కార్యవర్గ సభ్యుల ముందస్తు ఆమోదం, తీర్మానం ఉన్నాయని స్పష్టం చేశారు. అన్ని జిల్లాల నుంచి కళాకారులు పెద్ద ఎత్తున తరలివచ్చి వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ విలేకరుల సమావేశంలో గౌరవ సలహాదారు దరువు అంజన్న, కోశాధికారి గజ్వేల్ వేణు, రాష్ట్ర కార్యనిర్వాహక వర్గ సభ్యులు జడల రమేష్, రాష్ట్ర కార్యవర్గ ప్రచార కార్యదర్శి ఆకునూరీ దేవయ్య, కాపర్తి మల్లికార్జున్, మంకాల ప్రసాద్, పాత శ్రీధర్, చికోడు నరసింహులు, ఫోక్ ఇండస్ట్రీ సభ్యులు ఎడమల శ్రీధర్ రెడ్డి, నవీన్, చిత్తారమ్మ మల్లేశం, శ్రీధర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA