Tangallapalli: ఏవియేషన్ ఒలింపియాడ్ ఫైనల్‌కు కేజీబీవీ విద్యార్థులు
Tangallapalli: జాతీయ స్థాయి ఏవియేషన్ ఒలింపియాడ్ ఫైనల్‌కు తంగళ్లపల్లి కేజీబీవీ విద్యార్థినులు స్మిత, రితీష ఎంపికయ్యారు; కలెక్టర్ గరిమ అగ్రవాల్ అభినందించారు.
Tangallapalli: ఏవియేషన్ ఒలింపియాడ్ ఫైనల్‌కు కేజీబీవీ విద్యార్థులు
తంగళ్లపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థినులు జాతీయ స్థాయి ఏవియేషన్ ఒలింపియాడ్ ఫైనల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ వారిని అభినందించారు.
ఈ ఏడాది నిర్వహించిన ఏవియేషన్ ఒలింపియాడ్‌లో దేశవ్యాప్తంగా 12,440కు పైగా పాఠశాలల నుంచి 2,09,280 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరిలో 145 మంది మాత్రమే జాతీయ స్థాయి ఫైనల్ పోటీలకు అర్హత సాధించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి ఐదుగురు విద్యార్థులు ఫైనల్‌కు ఎంపిక కాగా, వారిలో ఇద్దరు తంగళ్లపల్లి కేజీబీవీ విద్యార్థినులు ఉండటం విశేషం.
తంగళ్లపల్లి కేజీబీవీకి చెందిన అలూరి స్మిత (9వ తరగతి), తోంటి రితీష (10వ తరగతి) ఒలింపియాడ్‌లో నిర్వహించిన మూడు దశల పోటీలను విజయవంతంగా అధిగమించి జాతీయ స్థాయి ఫైనల్‌కు అర్హత సాధించారు. ఈ నేపథ్యంలో గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కలెక్టర్ గరిమ అగ్రవాల్ విద్యార్థినులను అభినందించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా విద్యార్థినులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరగనున్న ఫైనల్ పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి విజయ సాగర్, జీసీడీవో పద్మజ తదితరులు పాల్గొన్నారు.




