Sircilla: 2 వేల విత్తన బంతులతో మోదీ చిత్రపటం తయారీ!
Sircilla: ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా 2 వేల విత్తన బంతులతో చిత్రపటం రూపొందించిన సిరిసిల్ల విద్యార్థిని బ్లెస్సి. పర్యావరణ పరిరక్షణ సందేశంతో వినూత్న శుభాకాంక్షలు.
Sircilla: 2 వేల విత్తన బంతులతో మోదీ చిత్రపటం తయారీ!
Sircilla: ప్రధాని నరేంద్ర మోదీ 76వ జన్మదినం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ చిన్నారి వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపింది. కోనరావుపేట మండలం సుద్దాల గ్రామానికి చెందిన ఏడో తరగతి విద్యార్థిని దొబ్బల బ్లెస్సి.. సుమారు 2 వేల విత్తన బంతులతో ప్రధాని మోదీ చిత్రపటాన్ని రూపొందించింది.
మర్రి, రాగి తదితర విత్తనాలతో తయారు చేసిన విత్తన బంతులతో సుద్దాల గ్రామంలో మోదీ చిత్రపటాన్ని రూపొందించి తన అభిమానాన్ని చాటుకుంది. పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని అందించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
బ్లెస్సి బద్దెనపల్లి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆమె తండ్రి ప్రకృతి ప్రకాష్ నిర్వహిస్తున్న పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల నుంచి స్ఫూర్తి పొందిన బ్లెస్సి.. చిన్ననాటి నుంచే మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం, విత్తనాలను సేకరించడం వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది.
వేసవిలో సేకరించిన విత్తనాలతో విత్తన బంతులను తయారు చేసి తండ్రితో కలిసి అడవుల్లో చల్లుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పిలుపుతో పర్యావరణ పరిరక్షణపై మరింతగా దృష్టి సారించింది. తాను మొక్కలు నాటడంతో పాటు పాఠశాలలోని తోటి విద్యార్థినులను కూడా మొక్కలు నాటి సంరక్షించేలా ప్రోత్సహిస్తోంది.
పర్యావరణంపై బ్లెస్సికి ఉన్న ఆసక్తిని గుర్తించిన నిర్వాహకులు ఆమెకు ‘వనజీవి రామయ్య’ డాక్యుమెంటరీ చిత్రంలో నటించే అవకాశం కల్పించారు.
ప్రధాని జన్మదినాన్ని పురస్కరించుకుని తనదైన రీతిలో శుభాకాంక్షలు చెప్పాలనే ఉద్దేశంతో బ్లెస్సి ఈ విత్తన బంతులను సిద్ధం చేసింది. సుమారు 2 వేల విత్తన బంతులతో రూపొందించిన మోదీ చిత్రపటం స్థానికంగా ఆకట్టుకుంది. పుట్టినరోజు శుభాకాంక్షలతో పాటు పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని కూడా ఈ కార్యక్రమం ద్వారా చాటిచెప్పింది.




