Sircilla: గణేష్ మండపాలను సందర్శించిన ఎస్పీ మహేష్ బి. గితే

Sircilla: సిరిసిల్లలో గణేష్ మండపాలను సందర్శించి పూజలు నిర్వహించిన ఎస్పీ మహేష్ బి. గితే. నిమజ్జనంలో డీజేలు నిషేధమని, నిబంధనలు పాటించాలని హెచ్చరిక.

KALEEM, SIRICILLA
Published on: 21 Sept 2026 8:27 PM IST
Sircilla
X

Sircilla: గణేష్ మండపాలను సందర్శించిన ఎస్పీ మహేష్ బి. గితే

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, నిమజ్జనాన్ని సురక్షితంగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని పలు గణేష్ మండపాలను జిల్లా ఎస్పీ సందర్శించి, గణనాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండపాల వద్ద ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బి. గితే మాట్లాడుతూ జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 2,200 గణేష్ మండపాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖ సూచించిన నిబంధనలు, భద్రతా సూచనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. నిర్వాహకులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కోరారు.

గణేష్ నిమజ్జనం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ డీజేలకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేస్తే సంబంధిత డీజే యజమానులతో పాటు మండపాల నిర్వాహకులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మండపాల నిర్వాహకులు ముందస్తు ప్రణాళికతో నిర్దేశించిన సమయానికి నిమజ్జనం పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎలాంటి గొడవలు, అవాంఛనీయ సంఘటనలు, ప్రమాదాలు చోటుచేసుకోకుండా శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా పోలీస్ శాఖకు సహకరించాలని కోరారు.

ఉత్సవాల సందర్భంగా ఏవైనా సమస్యలు తలెత్తినా, అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది, గణేష్ మండపాల నిర్వాహకులు ఉన్నారు.

KALEEM, SIRICILLA

KALEEM, SIRICILLA