Sircilla: అంగన్‌వాడీల బలోపేతానికి ప్రజా భాగస్వామ్యం ముఖ్యం: జిందం కళ
Sircilla: సిరిసిల్లలో పోషణ మాసం-2026 ముగింపు వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, అంగన్‌వాడీల బలోపేతానికి ఏఎంసీ కమిటీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Sircilla: అంగన్‌వాడీల బలోపేతానికి ప్రజా భాగస్వామ్యం ముఖ్యం: జిందం కళ
సిరిసిల్ల: స్థానిక కళ్యాణ లక్ష్మి గార్డెన్‌లో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పోషణ మాసం–2026 ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా నిర్వహించిన “మన అంగన్‌వాడీ – మన బాధ్యత” కార్యక్రమానికి మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిందం కళా చక్రపాణి మాట్లాడుతూ.. చిన్నారుల ఆరోగ్యం, పోషణ, విద్యాభివృద్ధిలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. మహిళలకు పోషకాహార ప్రాధాన్యతపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నెల రోజుల పాటు పోషణ మాసం–2026 కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయడంలో భాగంగా అంగన్‌వాడీ సిబ్బందితో పాటు స్థానిక ప్రజలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అంగన్‌వాడీ నిర్వహణ కమిటీలు (AMC) ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కమిటీలు అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతులు, పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారం, ఆరోగ్య సేవలు సక్రమంగా అందేలా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని AMC కమిటీ సభ్యులకు సూచించారు. చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు అందుతున్న సేవలపై అవగాహన పెంచుకోవాలని కోరారు.
అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఏర్పాటు చేసిన AMC కమిటీలు సమర్థవంతంగా పనిచేసేలా సంబంధిత అధికారులు, అంగన్‌వాడీ సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.
అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సామూహిక శ్రీమంతం కార్యక్రమంలో పాల్గొని గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో వేములవాడ మున్సిపల్ చైర్‌పర్సన్ రాజు, కౌన్సిలర్లు భాగ్యలక్ష్మి దేవరాజ్, రికమంల్లి రజిత సంపత్, ఆకుల స్వప్న కృష్ణ, CDPOలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, అంగన్‌వాడీ టీచర్లు, ఆర్పీలు, ANMలు, ఆశా కార్యకర్తలు, వార్డు సభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




