Sircilla: తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం!
Sircilla: తంగళ్లపల్లి పీఎస్‌లో విద్యార్థుల కోసం ఓపెన్ హౌస్. పోలీసుల విధులు, చట్టాలు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించిన ఎస్సై అశోక్.
Sircilla: తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం!
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్‌లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) కార్యక్రమాల్లో భాగంగా ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. తంగళ్లపల్లి, అంకుశాపూర్ ప్రభుత్వ పాఠశాలలతో పాటు సరస్వతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులకు పోలీసు చట్టాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, ఫింగర్ ప్రింట్ పరికరాలు, ట్రాఫిక్ పరికరాలు, రహదారి భద్రతా నిబంధనలు, సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పించారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు, సైబర్ నేరం జరిగిన వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా తంగళ్లపల్లి ఎస్సై సిరిసిల్ల అశోక్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. విద్యార్థులు చట్టాలను గౌరవించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని సూచించారు. సైబర్ నేరగాళ్ల మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని వివరించారు.
విద్యార్థులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని పోలీసుల విధులు, భద్రతా చర్యల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఏఎస్ఐ జాన్, హెడ్ కానిస్టేబుళ్లు బాలిరెడ్డి, పద్మ, సుధాకర్, స్టేషన్ రైటర్ సందీప్, రిసెప్షన్ కానిస్టేబుల్ రాజ్ కుమార్, సైబర్ క్రైమ్ కానిస్టేబుల్ ప్రవళిక, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.




